Begin typing your search above and press return to search.

ఏపీలో భారీగా తెలంగాణ మద్యం .. ప.గో జిల్లాలో స్వాధీనం చేసుకున్న ఎస్‌ఈబీ !

By:  Tupaki Desk   |   23 July 2020 11:30 AM GMT
ఏపీలో భారీగా తెలంగాణ మద్యం .. ప.గో జిల్లాలో స్వాధీనం చేసుకున్న ఎస్‌ఈబీ !
X
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఏపీలో మద్యం ధరల్ని భారీగా పెంచేసింది. మద్యం ధరలు పెంచితే ..సామాన్యులు కొద్దీ కొద్దిగా మద్యానికి దూరం అవుతారు అనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ప్రభుత్వం కంటే మందుబాబులు, అక్రమ మద్యం దారులు ఇంకా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు పెంచడంతో తెలంగాణ ప్రాంతాల నుండి ఏపీలోకి మద్యం అక్రమరవాణా విచ్చలవిడిగా సాగుతుంది. ప్రతిరోజు ఏదో చోట ఏపీ ‌ పోలీసులు తెలంగాణ నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. లారీలు, కార్లు, అంబులెన్స్‌లు, ద్విచక్రవాహనాలు, కాలినడకన ఇలా పలురకాలుగా మద్యం తెలంగాణా నుంచి ఏపీకి తరలిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. జీలుగుమిల్లి చెక్ పోస్ట్ దగ్గర అక్రమ మద్యంపై సమాచారం అందింది. దీనితో వెంటనే రంగంలోకి ఎస్ఈబీ ( స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ) ఎస్పీ బోర్డర్ చెక్ ‌పోస్ట్ దగ్గర బుధవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాలోకి తరలిస్తున్న భారీగా అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు 4,275 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.. ఓ డ్రైవర్‌ ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.20 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జంగారెడ్డిగూడెం కేంద్రంగా అక్రమ మద్యం మాఫియా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు