Begin typing your search above and press return to search.

మరుగుజ్జు బీజేపీతో కలవాలా సాయి అన్నా?

By:  Tupaki Desk   |   3 Jan 2022 5:31 AM GMT
మరుగుజ్జు బీజేపీతో కలవాలా సాయి అన్నా?
X
వేలెత్తి చూపిస్తే చాలు.. ఎదుటోడి లోపాలు ఇట్టే కనిపిస్తుంటాయి రాజకీయ నేతలకు. బాగున్నంత వరకు భాయ్.. భాయ్ అనుకోవటం.. తేడా వస్తే చాలు.. వెనుకా ముందు చూడకుండా విమర్శలు చేయటం రాజకీయ నేతలకు ఎంత తేలికైన విషయమో తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. ఏపీ అధికార పార్టీలో కీలక నేతగా వ్యవహరించే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమవుతాయి.

గడిచిన కొద్ది రోజులుగా ఏపీ అధికారపక్షంపై ఏపీ బీజేపీ నేతలు కత్తి కట్టినట్లుగా వ్యవహరించటం.. ప్రభుత్వ విధానాల్ని తప్పు పట్టటమే కాదు.. కొత్త డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చి సరికొత్త తలనొప్పుల్ని తీసుకొస్తున్నారు.

గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాలని.. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి పేరు మార్చాలని.. ఇలా భావోద్వేగాల్ని టచ్ చేసే అంశాల్ని ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతల నోటి నుంచి వస్తున్నాయి. అంతేకాదు.. మద్యం సేవించే కోటి మంది తమ పార్టీకి ఓటు వేస్తే.. తాము అధికారంలోకి వస్తామని.. అలా వచ్చినంతనే చీప్ లిక్కర్ ను రూ.75లకే ఇస్తామని చెప్పటం తెలిసిందే. ఆదాయం బాగా వస్తే రూ.50లకే చీప్ లిక్కర్ అందించే అంశాన్ని తాము పరిగణలోకి తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించటం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ అగ్గి రాజుకుంది. అందుకు తగ్గట్లే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. బీజేజేపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందుతుంటే కమలనాథులకు నచ్చటం లేదన్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వంపై ఎప్పుడూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. బీజేపీ నేతలవి మరుగుజ్జుఆలోచనలుగా ఆయన అభివర్ణించారు.

గుంటూరు జిన్నా టవర్.. వైజాగ్ కేజీహెచ్ పేర్లు మార్పు కోరే బదులు.. ప్రత్యేక హోదా.. పోలవరం నిధుల కోసమో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనో తమ జాతీయనాయకత్వంపై ఒత్తిడి తెస్తే మంచిది కదా? అన్న ప్రశ్నను సంధించారు. చీప్ లిక్కర్ డ్యామేజ్ కవరింగుకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో ట్వీట్ తో విరుచుకుపడ్డారు. అయితే.. ట్వీట్ లో ఘాటు వ్యాఖ్యలు చేసినంతనే.. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు.. తమ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు మర్చిపోరు కదా? అన్నది ప్రశ్న.

విజయసాయి రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నట్లు.. చీప్ లిక్కర్ డ్యామేజ్ కవరింగ్ కు సోము ప్రయత్నిస్తున్నారన్న దానిలో అర్థం లేదు. ఎందుకంటే.. చీప్ లిక్కర్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రియాక్టు అవుతూ.. చురకలు వేస్తే.. దానికి ధీటుగా బదులిచ్చిన సోము.. తాను చెప్పే ప్రతి మాటా 2024 పార్టీ ఎన్నికల హామీ పత్రంలో ఉంటుందని చెప్పారు. అంటే.. చీప్ లిక్కర్ మీద తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు సోము ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇక.. గుంటూరు జిన్నా టవర్.. వైజాగ్ కేజీహెచ్ పేర్లు మార్పు విషయానికి వస్తే.. బీజేపీ ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి భావోద్వేగ అంశాల్ని ప్రస్తావించటం.. ఫైట్ చేయటం చూస్తున్నాం. నిజానికి ఏపీ బీజేపీ నేతలు ప్రత్యేక హోదా.. పోలవరం నిధులు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పోరాడాలనటంలోనే సాయి అన్న తెలివిగా మాట్లాడినట్లు కనిపించినా.. లోతుగా చూస్తే డొల్లతనమే కనిపిస్తుంది.

ఎందుకంటే.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ బీజేపీ నేతలు తమ పార్టీ అధినాయకత్వం స్టాండ్ కు తగ్గట్లే మాట్లాడారు కానీ.. మాట మార్చలేదు. ఆ మాటకు వస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏం చేసైనా సరే ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ అన్నారన్న విషయాన్ని విజయసాయి మర్చిపోయినట్లున్నారు.

సాయి అన్న చెప్పినట్లుగా.. ప్రత్యేక హోదా.. పోలవరం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి వాటి మీద ఏపీ బీజేపీ నేతల వరకు ఎందుకు? జగన్ సర్కారు పట్టుదలతో ఉండి.. కేంద్రానికి కీలకమైన బిల్లుల వేళ.. తమ గళాన్ని సరైన రీతిలో వినిపించి ఉండొచ్చు కదా? ఇప్పుడు మరుగుజ్జు నేతలుగా కనిపిస్తున్న బీజేపీతో.. గడిచిన మూడేళ్లుగా కలిసి ప్రయాణించిన విషయం ఎవరికి తెలీదు? తేడా వచ్చినంతనే మరుగుజ్జు నేతలుగా విజయసాయికి కనిపించొచ్చు.

కానీ.. ఇంతకాలం కేంద్రంలోని కమలనాథులతో కలిసి జర్నీ చేసిన విషయాన్ని సాయి మర్చిపోవచ్చు? కానీ.. ప్రజల మనసుల్లో మాత్రం ముద్ర పడింది కదా? మరుగుజ్జు మనుషులంటూ ఎద్దేవా బాగున్నా.. ఆ వెంటనే తమ గురించి ప్రజలు అనుకునే మాటల గురించి విజయసాయి కాస్తంత ఆలోచించి ఉంటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదేమో?