Begin typing your search above and press return to search.

ఎవరు వెనక్కు తగ్గట్లేదుగా ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 11:30 AM GMT
ఎవరు వెనక్కు తగ్గట్లేదుగా ?
X
పీఆర్సీ వివాదం విషయంలో రెండు వైపుల ఎవరూ వెనక్కు తగ్గట్లేదు. కొత్త పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేస్తే పాత పీఆర్సీ ప్రకారమే తమ జీతాలు కావాలంటు ఉద్యోగ సంఘాల నేతలు తీర్మానం చేశారు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇదే సమయంలో విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నేతలు సమావేశమయ్యారు.

కొత్త పీఆర్సీనే అమలు చేయాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది. అంటే ఉద్యోగులతో ఏదో ఒకటి తేల్చుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా అర్ధమైపోతోంది. ఇదే సమయంలో పాత పీఆర్సీ అమలు కోసం ఉద్యమాన్ని ఎంతస్ధాయికైనా తీసుకెళ్ళాలని ఉద్యోగ నేతల సమావేశం తీర్మానించింది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో సహాయ నిరాకరణ, 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగ నేతలు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అంటే ఉద్యోగ నేతలు కూడా ప్రభుత్వం కథేంటో తేల్చుకోవాల్సిందే అన్నట్లుగా ఉన్నారు.

ఈనెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీలోగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయాలని కూడా నేతలు డిసైడ్ చేశారు. మండల స్ధాయి తర్వాత నియోజకవర్గాలు ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో చేయబోయే ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు. ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్రంలోని నలుమూలల నుండి చలో విజయవాడ కార్యక్రమం జరుగుతుందని పిలుపిచ్చారు. అంటే ఫిబ్రవరి 3వ తేదీతో ఆందోళనలు పీక్ స్టేజికి చేరుకుంటాయన్నమాట.

ఇటు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటంటే పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు నచ్చ చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కమిటి వేయాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది. మంత్రులు పేర్నినాని, బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ ఉంటారు. అయితే ఈ కమిటితో ఉద్యోగ నేతలు భేటీ అయ్యేది అనుమానమే. ప్రభుత్వం, ఉద్యోగుల నేతల ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడి ఉండటంతో చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.