Begin typing your search above and press return to search.

విశాఖకు మద్దతుగా మంత్రులు... గ్రౌండ్ రియాల్టీ ఇదేనా...?

By:  Tupaki Desk   |   24 Sep 2022 4:30 PM GMT
విశాఖకు మద్దతుగా మంత్రులు... గ్రౌండ్ రియాల్టీ ఇదేనా...?
X
ఏపీలో వైసీపీ వాదం మూడు రాజధానులు. హైకోర్టులో తీర్పు వచ్చేసింది. అమరావతి రాజధాని అంటూ తేల్చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అక్కడ ఏం చెబుతారు అన్నది ఒక వైపు చర్చగా ఉంటే ఇపుడు రాజకీయ సయ్యాట ఇదే ఇష్యూ మీద మొదలైంది. ఏపీ అంతా అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ పాదయాత్ర విశాఖ మీదుగా ఉత్తరాంధ్రా అంతటా నెల రోజుల పాటు సాగనుంది. అమరావతి రైతుల పాదయాత్ర వెనక టీడీపీ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సుదీర్ఘమైన పాదయాత్ర కనుక సక్సెస్ అయితే కోర్టు తీర్పు ఎలా ఉన్నా రాజకీయంగా వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుంది.

దాంతో పాదయాత్ర ఇంకా క్రిష్ణా జిల్లాలో ఉండగానే విశాఖ సహా ఉత్తరాంధ్రాలో విశాఖ రాజధానికి మద్దతుగా జనాలను కూడగట్టి ఉద్యమాలను చేసేందుకు ఆ పార్టీ గట్టి కసరత్తు చేస్తోంది. రాజధాని కొరకు వైసీపీ మంత్రులు మద్దతుగా ముందుకు రానున్నారు అని తెలుస్తోంది. దీనికి ఆరంభంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని తొట్ట తొలిగా ఈ నెల 25న విశాఖలో పెడుతున్నారు. దీనికి రాజకీయాలకు అతీతంగా మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాలు, తటస్థులు, విద్యావంతులు ఉత్తరాంధ్రా కోసం పోరాడే వ్యక్తులు శక్తులను ఆహ్వానించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశం విశాఖ రాజధాని కోసం ఏం చేయాలి ఎలా ఉద్యమాన్ని నిర్మించాలి అన్నది నిర్ణయిస్తుంది అని చెబుతున్నారు. విశాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సమావేశానికి ఉత్తరాంధ్రా మంత్రులు బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, సీదరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు వంటి వారు హాజరవుతారు అని తెలుస్తోంది.

అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతారని చెబుతున్నారు. ఇక ఇదే తరహా సమావేశాలు ఉత్తరాంధ్రాలోని అన్ని జిల్లాలలో కూడా నిర్వహిస్తారు అని చెబుతున్నారు. ఇప్పటికైతే ఏయూలో ఉన్న విద్యార్ధులతో జేఏసీగా ఏర్పాటు చేసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే కొందరు ప్రొఫెసర్లతో మీడియా ద్వారా విశాఖ రాజధానికి మద్దతుగా ప్రకటనలు కూడా ఇప్పిస్తున్నారు.

అయితే విశాఖ రాజధాని విషయం జనాలకు అయితే ఈ రోజుకు పెద్దగా పట్టని విషయంగానే ఉంది. నిజం చెప్పాలీ అంటే 2020లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసిన నాడు వచ్చిన ఉత్సాహం కూడా నేడు జనాలలో రావడంలేదు. దానికి కారణం హైకోర్టు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడం. సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవడం. దాంతో ఒక రకమైన నిర్లిప్తత వాతావరణం అయితే లోకల్ గా ఉంది.

మరో వైపు చూస్తే మూడున్నరేళ్ళ వైసీపీ ఏలుబడిలో అధికార పార్టీ మీద వచ్చిన వ్యతిరేకత కూడా కలసి ఇపుడు జనాల్లో విశాఖ రాజధాని ప్రభావం పెద్దగా లేకుండా చేస్తోంది అని అంటున్నారు. జనాలలో అనేక ఇతర సమస్యల మీద దృష్టి ఉంది. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వారు కోరుకుంటున్న వేళ రాజధాని ఇష్యూని రగిల్చి ముందుకు తీసుకెళ్ళాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ సఫలీకృతం అవుతాయో చెప్పలేమని అంటున్నారు.

ఇంకో వైపు తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల నుంచి విశాఖ రూరల్ జిల్లాలోకి పాదయాత్ర అక్టోబర్ లో ఎంటర్ అవుతుంది. అయితే ఈ పాదయాత్రను విశాఖలో ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఆయా చోట్ల ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు వరసబెట్టి ప్రకటిస్తున్నారు. దానికి కౌంటర్ గా మేము దగ్గరుండి పాదయాత్రకు స్వాగతం పలుకుతామని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా పాదయాత్రను అడ్డుకుంటే కేంద్రం మీద దాడి చేసినట్లే అని హెచ్చరిస్తున్నారు.

ఇవన్నీ చూస్తూంటే అమరావతి పాదయాత్ర విశాఖలో ప్రవేశించే వేళ ఏమైనా అవాంచనీయ ఘటనలు జరుగుతాయా అన్న భయాలు అయితే అందరిలో ఉన్నాయి. మరో వైపు మంత్రి గుడివాడ అమరనాధ్ అమరావతి రైతులు తమ ఉత్తరాంధ్రా పాదయాత్ర విరమించుకోవాలని కోరడం విశేషం. భావోద్వేగాలు ఈ ప్రాంతం వారివి దెబ్బతింటాయని ఆయన చెబుతున్నారు. అయితే గ్రౌండ్ రియాలిటీ చూస్తే పాదయాత్ర జరిగినా తమకేంటి అన్నట్లుగా జనాలు ఉన్నారనే అంటున్నారు. మొత్తానికి విశాఖ రాజధానికి అనుకూలంగా మద్దతు కూడగట్టాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయన్నది చూడాల్సిందే అంటున్నారు.