Begin typing your search above and press return to search.

టోటల్ రీచార్జి... ?

By:  Tupaki Desk   |   21 Oct 2021 1:30 AM GMT
టోటల్ రీచార్జి... ?
X
ఒక్కోసారి సంఘటలను అనూహ్యం అయినా కూడా అవి మరో విధంగా మేలే చేస్తాయేమో. ఇపుడు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా వార్ నడుస్తోంది. అది శృతి మించి రాగాన పడిపోయింది. అయితే దీని వల్ల రెండు పార్టీలకు బాగానే హెల్ప్ అయింది అంటున్నారు. అదెలా అంటే ఏపీలో పాలిటిక్స్ కొంతకాలంగా చప్పగా సాగుతోంది. అధికారం లేక హుషార్ రాక టీడీపీ లో నైరాశ్యం ఒక లెక్కన ఉంది. అధికార వైసీపీలో చూసుకుంటే మంత్రి పదవులు ఎపుడు పోతాయో తెలియక మంత్రులు అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా గమ్మున ఉన్నారు. ఈ టైమ్ లో అటు టీడీపీ నేత పట్టాభి జగన్ మీద రెచ్చిపోయి మాట్లాడడంతో వైసీపీలో ఒక్కసారిగా వేడి పెరింది. దాంతో తన్నుకు వచ్చిన పౌరుషం కాస్తా క్యాడర్ చేత కొన్ని దురదృష్ట సంఘటనలు దారితీయించింది.

అయితే ఆ తరువాత పరిణామలు చూసుకుంటే వైసీపీలో టాప్ టూ బాటం అంతా ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారు. అంతా కలసి చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని మాటల దాడి మొదలెట్టేశారు. ఇక ఎన్నడూ నోరు విప్పని ముఖ్యమంత్రి జగన్ సైతం టీడీపీని ఇండైరెక్ట్ గా విమర్శించారు. వైసీపీ మీద చంద్రబాబు లోకేష్ చేసిన కామెంట్స్ కి వైసీపీలో కీలక మంత్రులు అంతా కూడా కట్టగట్టుకుని మరీ గట్టి రిటార్ట్ ఇచ్చేశారు. ఇక ఈ మధ్య మీడియాలో అంతగా కనిపించని అంబటి రాంబాబు లాంటి వారు కూడా టీడీపీ నేతల దుర్భాషల మీద మండిపడుతూ దూకుడు చేశారు. దాంతో పార్టీ అంటా టోటల్ గా రీచార్జి అయిందని వైసీపీలో ఒక వైపు హర్షం వ్యక్తం అవుతోంది.

అదే టైమ్ లో టీడీపీ ని తీసుకుంటే ఆ పార్టీ కూడా చాలా రోజులుగా క్యాడర్ ని లీడర్ ని హుషారెత్తించాలని చూస్తోంది. అనుకోకుండా వైసీపీ వారి దుందుడుకు చర్యలతో ఇంతకాలం గమ్మునున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చాయి. తమ పార్టీ ఆఫీస్ మీదకు వచ్చి దాడులు చేస్తారా అంటూ తమ్ముళ్ళు కట్టలు తెంచుకున్న ఆవేశంతో నిరసనలు దిగిపోయారు. ఒక విధంగా టీడీపీలో రెండున్నరేళ్ల తరువాత వచ్చిన కీలకమైన మార్పుగానే పార్టీ పెద్దలు దీన్ని చూస్తున్నారు. అయితే ఇలా రెచ్చగొట్టుడు రాజకీయాల మూలంగా పార్టీ క్యాడర్ ఉత్తేజం కావడం మంచి పరిణామం కాకపోయినా గతంలో ఎన్ని సార్లు పిలుపు ఇచ్చినా పెద్దగా పట్టని వారంతా ఇపుడు బాగానే రియాక్ట్ అయ్యారన్న ఆనందం అయితే టీడీపీ పెద్దలలో ఉంది. అయితే జరిగిందేదో జరిగింది, ఇక మీదట ఈ రకమైన రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజా సమస్యల మీద క్యాడర్ ని అధికార విపక్షాలు కదిపి జనంలో ఉంచుతారా లేక ఇలాంటి రగడల‌కే ప్రాముఖ్యత ఇస్తారా లేదా అన్నది వారి వివేచన మీదనే ఆధారపడి ఉంది అన్నది వాస్తవం.