Begin typing your search above and press return to search.

అక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు మంత్రి పదవి ఖాయం....?

By:  Tupaki Desk   |   29 Jan 2023 12:00 PM GMT
అక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు మంత్రి పదవి ఖాయం....?
X
విశాఖ జిల్లాలో భీమిలీ నియోజకవర్గనికి ఒక ప్రతిష్ట ఉంది. ఆ నియోజకవర్గం ఎపుడూ మంత్రులనే చూస్తూ వచ్చింది. 1983 వరకూ కాంగ్రెస్ కి అండగా ఉన్న ఈ నియోజకవర్గంలో అపుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాజులు మంత్రులు అయ్యారు. 1983లో తొలిసారి విజయనగరం పూసపాటి వంశీకుడు అయిన ఆనందగజపతిరాజు పోటీ చేసి గెలిచారు. ఆ వెంటనే ఆయన ఎన్టీయార్ మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రి అయ్యారు.

ఇక ఆ తరువాత ఆర్ ఎస్ డీపీ అప్పల నరసింహ రాజు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాసరావు 2014 నుంచి 2019 దాకా మంత్రి గా ఉన్నారు. తెలుగుదేశం నుంచి వైసీపీలోకి జంప్ చేసిన అవంతి శ్రీనివాసరావు జగన్ క్యాబినెట్ లో మొదటి విడతలో మంత్రి అయ్యారు. మూడేళ్ల పాటు కొనసాగారు.

ఇక 2024 ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అన్నదాని మీద చర్చ సాగుతోంది. విశాఖ నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా సెంటిమెంట్ సీటు అయిన భీమిలీ మీద కన్నేశారు. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిస్తే కచ్చితంగా అధికారంలోకి రావడమే కాదు మంత్రి పదవి కూడా దక్కుతుంది అని ఆయన నమ్ముతున్నారు. పైగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం వల్ల ఆయనకు బలమైన అనుచర గణం ఉంది.

దాంతో గంటా భీమిలీ సీటు ని టార్గెట్ చేశారు. గంటా భీమిలీ సీటు కోసం హై కమాండ్ తో అపుడే మాట్లాడి ఓకే చేయించుకున్నారు అని అంటున్నారు. కాపు సామాజికవర్గం అధికంగా ఇక్కడ ఉంది. గంటా కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో గెలుపు మినిస్టర్ పోస్ట్ రెండూ భీమిలీ నుంచే అని ధీమాగా ఉన్నారు.

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా మరోసారి మంత్రి అవుతాను అంటున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేస్తాను అంటున్నారు. వైసీపీకి కూడా ఆయనను మించి వేరే బలమైన క్యాండిడేట్ లేకుండా పోయారు. దాంతో అవంతికే టికెట్ అని అంటున్నారు. ఇక అవంతి గెలిస్తే మళ్లీ వైసీపీ పవర్ లోకి వస్తుందని మంత్రి పోస్ట్ తనకే అంటున్నారు. ఆయన అనుచరులు కూడా అదే నమ్మకంతో ఉన్నారు.

ఇలా గంటా అవంతి ఇద్దరూ మంత్రులము అవుతామని భీమిలీ నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారు. భీమిలీ అంటే వారికి అంత ఇష్టం. సెంటిమెంట్ కూడా. మరి భీమిలీలో గెలిచిన పార్టీయే ఏపీలో అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ కూడా ఉంది. దాంతో భీమిలీని విడిచిపెట్టమని ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటున్నారు. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ అంగబలం అర్ధంబలం ఉన్న వారే. దాంతో ఈ ఇద్దరు పోటీ చేస్తే కచ్చితంగా హోరాహోరీ పోటీ తప్పదనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.