Begin typing your search above and press return to search.

పరారీలో చింతమనేని..పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారే!

By:  Tupaki Desk   |   3 Sep 2019 3:08 PM GMT
పరారీలో చింతమనేని..పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారే!
X
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న టీడీపీ నేత - పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి... మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం తన తీరును మార్చుకున్నట్లుగా కనిపించలేదన్న వాదన వినిపిస్తోంది. తన నియోజకవర్గ పరిధిలో ఇసుక రవాణాకు సంబంధించి ఇటీవల మితిమీరి జోక్యం చేసుకున్న చింతమనేని... తనకు అడ్డు వచ్చిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దౌర్జన్యానికి దిగారట. బాధితుడిపై దాడికి దిగడంతో పాటు కులం పేరుతోనే దూషించారట. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా... చింతమనేనిపై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైపోయింది.

కేసు నమోదైన మరునాడు మీడియాతో మాట్లాడిన చింతమనేని... ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారన్న వార్తలు వైరల్ గా మారిపోయాయి. చింతమనేని ఏంటి? పరారీలో ఉండటమేంటి? అన్న కోణంలో చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో చింతమనేని కోసం పోలీసులు తమదైన శైలిలో వేట సాగిస్తున్నారు. తన కోసం వేట సాగిస్తున్న పోలీసులకు చింతమనేని నిజంగానే చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పరారీలో ఉన్న చింతమనేని ఓ కారులో వెళుతున్నారని - సదరు కారు వివరాలను పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు అందజేశారు. దీంతో హడావిడి చేసిన పోలీసులు ఛేజింగ్ చేసి మరీ సదరు వాహనాన్ని పట్టేసుకున్నారు.

తీరా కారులో చూశాక...అందులో చింతమనేని లేరని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురి కాగా... ఆ వెంటనే వారికి మరో షాక్ తగిలింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పట్టేసుకున్న కారుపై గుడివాడ ఎమ్మెల్యే - జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న కొడాలి నాని పేరు ఉందట. అయినా కొడాలి నాని స్టిక్కర్ ఉన్న కారులో చింతమనేని ఎలా ఉంటాడని పోలీసులు జుట్టు పీక్కోగా... కేసులో బెయిల్ వచ్చేదాకా చింతమనేని పోలీసులకు చిక్కరన్న కోణంలో ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.

ఎంతైనా చింతమనేని అంటేనే వివాదాలకు కేరాఫ్ కదా. అలాంటి నేత... ఏదో చిన్న కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే... ఆయన దొరుకుతారా? అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ వాదనలన్నింటినీ మించిపోయేలా... అసలు చింతమనేని పరారీలో ఉండటమేమిటి? ఆయన నిక్షేపంగా తన ఇంటిలోనే ఉన్నారని, పోలీసులే ఆయనను అరెస్ట్ చేసేందుకు ధైర్యం చాలడం లేదన్న వాదన మరొకటి వినిపిస్తోంది. ఏది ఏమైనా... ఎమ్మెల్యేగా ఓడిపోయినా, తన పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై అధికారం నుంచి దిగిపోయినా... చింతమనేని ఇస్తున్న ట్విస్టులు నిజంగానే ఆసక్తికరమేనని చెప్పక తప్పదు.