Begin typing your search above and press return to search.

పాదయాత్రను అడ్డుకోవటం ఎలా? ఏపీ పోలీసుల కొత్త పాఠాలు?

By:  Tupaki Desk   |   22 Oct 2022 4:30 AM GMT
పాదయాత్రను అడ్డుకోవటం ఎలా? ఏపీ పోలీసుల కొత్త పాఠాలు?
X
తెలుగు నేలకు పాదయాత్ర కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే.. తెలుగు రాజకీయాల్ని కీలక మలుపు తిప్పింది పాదయాత్రే. అలాంటి రాజకీయ పాదయాత్రలకు ఎప్పుడూ ఎలాంటి ఆటంకాలు కలగలేదు. రాజకీయంగా ఇబ్బంది అవుతుందని తెలిసినా.. ప్రజాక్షేత్రంలో సాగే పాదయాత్రల్ని అడ్డుకోవటం ప్రజాస్వామ్యం కాదన్న ఆలోచనల్లో గత ప్రభుత్వాలు ఉండేవి. పాదయాత్ర సాగుతున్న కొద్దీ.. ప్రజాదరణ ఎంతలా పెంచుకోవచ్చన్న విషయాన్ని గత ప్రభుత్వాలు గుర్తించినప్పటికీ.. వాటిని రూల్ బుక్ చూపించి అడ్డుకోవచ్చన్న ఆలోచన చేయలేదు అప్పటి ప్రభుత్వాలు. ఆ సాహసం దుస్సాహసం అవుతుందన్న ఆందోళనతో చూస్తుండిపోయారే తప్పించి.. అడుగడుగునా అంతులేని ఆంక్షల్ని అమలు చేసే ఎత్తుగడులకు తెర తీయలేదు.

అందరు నడిచిన దారిలో నడిస్తే ఆ ప్రభుత్వాన్ని జగన్ సర్కార్ అనలేం కదా? అందుకే కాబోలు.. తెలుగు నేల మీద జరిగిన.. జరుగుతున్న పాదయాత్రలకు భిన్నంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పోలీసుల తీరుపై తరచూ విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు అదే పనిగా ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం కూడా తెలిసిందే. ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ తో చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవటానికి జరిగిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇలాంటి ఎత్తుగడలు గతంలో ప్రదర్శించి ఉంటే.. పాదయాత్రలు జరిగేవే కావన్న మాట వినిపిస్తోంది.

తాము నడిచి వచ్చిన దారికి కొత్త అడ్డంకుల్ని క్రియేట్ చేయటంలో జగన్ సర్కారుకున్నంత టాలెంట్ మరెవరికీ లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూర్చే ఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రామవరం నుంచి 40వ రోజు పాదయాత్ర ఉదయం ప్రారంభమై.. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి ఎంటరైంది. జిల్లా పరిధిలోని రాయవరం మండలం నుంచి పసలపూడిలో భోజన విరామానికి ఆగారు. అక్కడి నుంచి మధ్యాహ్నం పాదయాత్ర ప్రారంభం కాగా.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పాదయాత్ర పసలపూడి వంతెన వద్దకు చేరుకున్న వేళ.. రామచంద్రాపురం.. అమలాపురం డీఎస్పీలు అడ్డుకున్నారు. అమరావతి రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని.. మిగిలిన వారు మాత్రం రోడ్డుకు ఇరువైపుల మాత్రమే ఉండాలంటూ పోలీసులు రూల్ బుక్ ను బయటకు తీశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రను మద్దతుదారులతో కలిసి ముందుకు కొనసాగించటాన్ని తప్పు పట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. పాదయాత్రలో ఉన్న వారి ఐడీ కార్డులు చూపించాలంటూ పోలీసులు చేసిన హడావుడితో కొత్త ఉద్రిక్తతకు తెర తీసినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాదయాత్రను ముందుకు సాగనివ్వకుండా పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై పాదయాత్రలో పాల్గొంటున్న మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురు మహిళా రైతులకు గాయాలు కావటం గమనార్హం. తీవ్ర ఉద్రిక్తత.. వాగ్వాదాల అనంతరం.. పాదయాత్రను ముందుకు సాగనిచ్చేందుకు పోలీసులు ఓకే చెప్పారు. కోర్టు ఆదేశాలంటూ పోలీసుల రూల్ బుక్ తీరుపై విపక్ష నేతలు పలువురు ధర్నా చేపట్టారు.

గంటల పాటు సాగిన ఉద్రిక్తతకు ఒక పరిష్కారం మార్గాన్ని వెతికే ప్రయత్నం చేశారు. చివరకు పాదయాత్ర చేసే రైతులు రథం వెనుక నడుస్తారని.. మిగిలిన వారంతా రథం ముందుకు నడుస్తారన్న ఒప్పందం కుదిరింది. దీంతో.. పాదయాత్ర మళ్లీ మొదలైంది. నిజానికి ఇదంతా చూసినప్పుడు.. ఇవన్నీ అవసరమా? అన్న సందేహానికి గురి కాక మానదు. ఇంతకుముందు పాదయాత్రలు చేపట్టిన వారి విషయంలో అప్పటి పోలీసులు ఇప్పటి మాదిరి రూల్ బుక్ ను బయటకు తీసి ఉంటే.. పరిస్థితి ఏలా ఉండేదన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఏమైనా.. అవసరానికి మించి బయటకు తీస్తున్న రూల్ బుక్ కారణంగా ప్రభుత్వానికి ఇమేజ్ డ్యామేజ్ తప్పించి మరింకేమీ ఉండదని అంటున్నారు. మరి.. ఈ విషయాన్ని అధికారపక్షం ఎందుకు గుర్తించనట్లు?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.