Begin typing your search above and press return to search.

ఆంధ్రా పోలీసులకు నో ఎంట్రీ!

By:  Tupaki Desk   |   30 Oct 2018 5:43 AM GMT
ఆంధ్రా పోలీసులకు నో ఎంట్రీ!
X
ఏ రాష్ట్రంలోనైనా స‌రే ఎన్నిక‌లు జ‌రుగుతుంటే పొరుగు రాష్ట్రాల నుంచి పోలీసు బ‌ల‌గాల‌ను ర‌ప్పించుకోవ‌డం కామ‌న్ విష‌యం. అలా ర‌ప్పించుకున్నందుకు ఆతిథ్య రాష్ట్రం వారికి స‌ముచిత జీత‌భ‌త్యాలు చెల్లిస్తుంది. అనంత‌రం తిరిగి అవ‌స‌ర‌మైన‌ప్పుడు ప‌క్క రాష్ట్రాల‌కు త‌మ బ‌ల‌గాల‌ను పంపిస్తుంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణకు కూడా పొరుగు రాష్ట్రాల బ‌ల‌గాలు విచ్చేయ‌నున్నాయి. ఎన్నిక‌ల వేళ త‌మ వంతు బందోబ‌స్తు నిర్వ‌హించ‌నున్నాయి. అయితే, తెలంగాణ‌కు విచ్చేయ‌నున్న బ‌ల‌గాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌ల‌గాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. స్వ‌యంగా తెలంగాణ ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆంధ్రా పోలీసుల‌ను ఈ ద‌ఫా ఎన్నిక‌ల విధుల‌కు తీసుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆంధ్రా పోలీసుల‌ను తెలంగాణ‌లో ఎన్నిక‌ల విధుల్లోకి తీసుకోబోమంటూ ర‌జ‌త్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యం వెనుక చాలా కార‌ణాలున్నాయి. కొన్ని రోజుల కింద‌ట జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. వారు కొంద‌రికి డ‌బ్బులు పంచుతుండ‌గా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స‌మాచారాన్ని ఎన్నిక‌ల సంఘానికి చేర‌వేశారు. ఈ ఘటనను సీరియ‌స్‌గా తీసుకున్న ఈసీ.. తెలంగాణలో ఏపీ నిఘా వర్గాల సంచారం, ఓటర్లను ప్రలోభపెట్టడంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో ఆంధ్రా పోలీసుల సాయాన్ని తెలంగాణ ఎన్నిక‌ల్లో తీసుకోకూడ‌ద‌ని ఈసీ నిర్ణ‌యించింది. ఏపీలో మావోయిస్టుల సంచారం వంటి అంశాల‌పై నిఘాను గాలికొదిలేసి.. ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణ ఎన్నిక‌ల‌పైనే దృష్టి సారిస్తున్నార‌ని గ‌తంలోనూ ఆరోప‌ణ‌లొచ్చిన సంగ‌తి గ‌మ‌నార్హం.

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు చెందిన 70 వేల మంది పోలీసుల సేవ‌ల‌ను వినియోగించుకుంటామ‌ని ర‌జ‌త్ కుమార్ వెల్ల‌డించారు. వారితోపాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి బలగాలను రప్పిస్తామని చెప్పారు. 307 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపాల్సిందిగా తాము కేంద్రాన్ని కోరామ‌ని.. 250 బ‌ల‌గాలకు ఇప్ప‌టికే ఆమోదం లభించిందని తెలిపారు. మ‌రిన్ని బ‌ల‌గాలు పంపాల్సిందిగా కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తామ‌న్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్ర బ‌ల‌గాల సహాయాన్ని కోర‌లేద‌ని వెల్ల‌డించారు.