Begin typing your search above and press return to search.

బాబు లీక్ వీడియోపై ఏపీ పోలీస్ ఆగ్రహం.. ఇది అవసరమా తమ్ముళ్లు?

By:  Tupaki Desk   |   18 Dec 2020 10:37 AM IST
బాబు లీక్ వీడియోపై ఏపీ పోలీస్ ఆగ్రహం.. ఇది అవసరమా తమ్ముళ్లు?
X
ఒకరు తప్పు చేశారనే అనుకుందాం. అలా అని.. తప్పు చేయాలా? వ్యవస్థల మీద పోరాడాలనుకున్నప్పుడు నీతి.. నిజాయితీ చాలా అవసరం. ఆ విషయంలో చోటు చేసుకునే తప్పులు ఏ మాత్రం సహించలేనివి. ఇటీవల ఏపీ పోలీసుల్ని ఉద్దేశించి లీకైన టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో సంచలనం. అందులో టీడీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసేలా కేసులు నమోదు చేస్తున్నారని.. అందుకే.. టీడీపీ కార్యకర్తలు సైతం ‘ఇరికించేలా’ కేసులు పెట్టాలని.. పోలీసులపై కంప్లైంట్ చేయాలన్న వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ఇమేజ్ దెబ్బ తీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. చంద్రబాబు లాంటి సీనియర్ నేత నోటి నుంచి ఇంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు రావటమా? అని కంగుతిన్న వారు లేకపోలేదు.

ఈ వీడియోపై తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల అసోసియేషన్ స్పందించింది. బాబును తీరును తీవ్రంగా తప్పు పట్టింది. బాబు వ్యాఖ్యలు పోలీసుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని.. చట్టం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసేందుకు బాబు ప్రోత్సహించటాన్ని వారు తప్పు పడుతున్నారు. పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో బాబు చేసిన వ్యాఖ్యలు సరికావంటున్నారు. పోలీసులపై తప్పుడు కేసులు పెట్టేలా వరుస పెట్టి కంప్లైంట్లు ఇవ్వాలనటం అందులో ఉంది. మూడు దఫాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు లాంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని పేర్కొంది.

తన తీరుతో నేరాలు పెరిగేందుకు చంద్రబాబు అవకాశం ఇస్తున్నారని మండిపడిన వారు.. దేశంలో అత్యుత్తమ పోలీస్ సేవల్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ఇమేజ్ దెబ్బ తీసేలా తరచూ విమర్శలు చేయటం సరికాదంటున్నారు. బాధ్యత లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు గమనిస్తారని.. వారే తగిన పాఠం చెబుతారంటున్నారు. మొత్తంగా బాబు వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం గుర్రుగా ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు... అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.