Begin typing your search above and press return to search.

తెలంగాణ తీరు రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంలో ఏపీ పిటిష‌న్‌!

By:  Tupaki Desk   |   14 July 2021 8:49 AM GMT
తెలంగాణ తీరు రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంలో ఏపీ పిటిష‌న్‌!
X
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన‌ జ‌ల వివాదం సుప్రీం కోర్టు చెంత‌కు చేరింది. కృష్ణా జ‌లాల విష‌యంలో తెలంగాణ స‌ర్కారు అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోందని, ఏపీకి ద‌క్కాల్సిన న్యాయ‌మైన వాటాను అడ్డుకుంటోంద‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీంతో.. కేంద్రాన్ని దాటుకొని అత్యున్న‌త ధ‌ర్మాస‌నం వ‌ద్ద‌కు నీటి పంచాయితీ చేరింది.

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం అక్ర‌మంగా నిర్మిస్తోందంటూ మొద‌లైన పంచాయితీ.. రోజురోజుకూ ముదురుతూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కృష్ణాబోర్డుకు రెండు రాష్ట్రాలూ లేఖ‌లు రాశాయి. అయినా.. ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఆ త‌ర్వాత కేంద్ర జ‌ల‌శ‌క్తికి, ప్ర‌ధానికి సైతం ఏపీ నుంచి లేఖ‌లు వెళ్లాయి. అయినా.. ప్ర‌ధాని మోడీ క‌నీసంగా కూడా స్పందించ‌లేదు. దీంతో.. ఇక త‌ప్ప‌ద‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది ఏపీ ప్ర‌భుత్వం.

కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు ప‌రిధిని నోటిఫై చేయాల‌ని సుప్రీంను కోరింది. అదేవిధంగా.. తెలంగాణ స‌ర్కారు జూన్ 28న జారీచేసిన జీవోను ర‌ద్దు చేయాల‌ని కోరింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. సాగు, తాగు కోసం వాడాల్సిన జలాలను సముద్రం పాలు చేస్తోందని, ఇది ప్రజల హక్కులను హ‌రించ‌డ‌మేన‌ని పేర్కొంది.

కృష్ణా జ‌లాల పంపిణీ అవార్డును తెలంగాణ ప్ర‌భుత్వం ఉల్లంఘిస్తోంద‌ని ఏపీ స‌ర్కారు సుప్రీంకు అందించిన‌ ఫిర్యాదులో తెలిపింది. విభ‌జ‌న చ‌ట్టాన్ని కూడా తెలంగాణ స‌ర్కారు ఉల్లంఘిస్తోంద‌ని పేర్కొంది. ఈ విష‌యంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరింది.

కాగా.. తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డం ద్వారా.. విలువైన నీరు వృథాగా సముద్రంలో క‌లిసిపోతోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఏపీ రాజ‌కీయ నేత‌లు తెలంగాణ స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అటు కేంద్రం తీరుపైనా ఏపీ స‌ర్కారు అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానికి రెండు సార్లు లేఖ‌లు రాసినా.. క‌నీసంగా కూడా స్పందించ‌లేద‌ని గుర్రుగా ఉంది. ఈ కార‌ణంగానే.. సుప్రీం కోర్టు త‌లుపు త‌ట్టింది ఏపీ స‌ర్కారు.

ఇటు తెలంగాణ సైతం త‌న వాద‌న‌ను గ‌ట్టిగానే వినిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్టే విధించినా.. ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నార‌ని చెప్ప‌బోతోంద‌ని స‌మాచారం. కృష్ణా బోర్డును సైతం రానివ్వ‌లేద‌ని కూడా చెప్ప‌నుంది. అదే స‌మయంలో.. జ‌ల విద్యుత్ ద్వారా ఏపీకి న‌ష్టం జ‌రుగుతుంద‌న్న వాద‌న‌ను సైతం తిప్పి కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త‌మ వాటాగా ఉన్న జ‌లాల‌ను మాత్ర‌మే వినియోగించుకుంటున్నామ‌ని, ఏపీ చేస్తున్న వాద‌న‌ల్లో వాస్త‌వం లేద‌ని చెప్ప‌నుంద‌ట‌. దీంతో.. సుప్రీం ఎలాంటి తీర్పు చెప్ప‌బోతుందో అనే ఆస‌క్తి రెండు రాష్ట్రాల్లోనూ నెల‌కొంది.

ఇదిలాఉంటే.. ఈ అంశంపై కేంద్రం ఎలా స్పందిస్తుంద‌న్న‌ది కూడా స‌స్పెన్స్ గా ఉంది. జ‌ల వివాదాన్ని విచారిస్తున్న‌ప్పుడు.. సుప్రీం కోర్టు కేంద్రాన్ని కూడా వివ‌ర‌ణ కోరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి, రాష్ట్రం రాసిన‌ ఉత్త‌రాల‌కు స్పందించ‌ని కేంద్రం.. సుప్రీం ఎదుట స‌మాధానం చెప్పాల్సి వ‌స్తే.. ఏం చెబుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

అయితే.. ఇది కేంద్రానికి అవ‌మాన‌క‌రం కాదా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. రెండు రాష్ట్రాల‌కు స‌ర్దిచెప్ప‌లేక‌పోవ‌డం విఫ‌ల‌మైన‌ట్టు కాదా? అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. అస‌లు క‌నీసంగా కూడా స్పందించ‌క‌పోవ‌డం ఏంట‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో కేంద్రంలోని బీజేపీ ఆలోచ‌న మ‌రో తీరుగా ఉందంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. రాజ‌కీయం చేస్తున్నార‌ని, ఇదంతా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకేన‌ని బీజేపీ సందేహిస్తోంద‌ని అంటున్నారు. ఈ కార‌ణంగానే.. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంచాయితీ విష‌యంలో జోక్యం చేసుకోలేద‌ని కొంద‌రు చెబుతున్నారు.