Begin typing your search above and press return to search.

ఏపీ ‘పంచాయితీ’: ఉన్నతాధికారుల బదిలీలో కొత్త ట్విస్ట్?

By:  Tupaki Desk   |   26 Jan 2021 12:31 PM IST
ఏపీ ‘పంచాయితీ’: ఉన్నతాధికారుల బదిలీలో కొత్త ట్విస్ట్?
X
ఏపీలో ‘పంచాయితీ’ ఎన్నికల కేంద్రంగా ఎన్ని వైరాలు చోటుచేసుకుంటున్నాయో అందరికీ తెలిసిందే. గత కరోనా ప్రబలినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఏపీసర్కార్ కూడా నిర్వహించడానికి రెడీ అయ్యింది.

అయితే సుప్రీం తీర్పు రాగానే ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ సోమవారం పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లపై బదిలీ వేటు వేశారు. ఎస్ఈసీ ఆదేశానుసారం ఏపీ ప్రభుత్వం నిన్న ఇద్దరినీ బదిలీ చేసేసింది.

అయితే తాజాగా ఎస్ఈసీ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికలను రీషెడ్యూల్ కూడా చేశామని.. ఇలాంటి కీలక సమయంలో అధికారుల బదిలీ సరికాదని మంగళవారం ఉదయం ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన జారీ చేసింది.

కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. ఇప్పటికే రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి , ఆ శాఖ కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారు.

దీనిపై పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి సైతం స్పందించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఇంకా ఎంతమందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోం అని వ్యాఖ్యానించారు.

అయితే ఎస్ఈసీ ఇలా బదిలీలు చేసి ఇప్పుడు వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ బదిలీల కథ ఎటు మారుతుందనేది ఆసక్తిగా మారింది.