Begin typing your search above and press return to search.

మండలి రద్దు: నాడు ఎన్టీఆర్..నేడు జగన్

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:17 AM GMT
మండలి రద్దు: నాడు ఎన్టీఆర్..నేడు జగన్
X
ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం సమావేశమైన ఏపీ కేబినెట్ మండలి రద్దు నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపనున్నారు. పార్లమెంట్ ఆమోదం పొందితే ఏపీ శాసనమండలి రద్దు అవుతుంది. కాలగర్భంలో కలిసి పోతుంది. సీఎం జగన్ నాన్న వైఎస్ఆర్ తీసుకొచ్చిన శాసనమండలిని ఆయన కుమారుడు జగన్ రద్దు చేస్తుండడం విశేషంగా మారింది.

చరిత్రలో ఏపీ శాసనమండలి రద్దు ఇదే తొలిసారి కాదు.. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా అయినప్పుడు కూడా రద్దు చేశారు. నాడు కాంగ్రెస్ ను ఓడించి అధికారం లోకి వచ్చిన తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ కు శాసన మండలి పక్కలో బల్లెంలా తయారైంది. శాసనసభ లో ఆమోదించిన బిల్లులను మండలిలో కాంగ్రెస్ అడ్డుకుంది. శాసనసభలో బలమున్న తెలుగుదేశం పార్టీ మండలిలో లేకపోవడంతో ఎన్టీఆర్ నాడు మండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే నాడు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది. టీడీపీకి పూర్తి శత్రువైన కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండలి రద్దును మొదట ఆమోదించలేదు. కానీ ఎన్టీఆర్ స్వయంగా నాటి ప్రధాని రాజీవ్ గాంధీతో సమావేశమై ఒక ఒప్పందం కూడా చేసుకొని మండలి ని పట్టుబట్టి రద్దు చేయించుకున్నారు.

ఇప్పుడు ఏపీ సీఎంగా 151 సీట్ల తో గద్దెనెక్కిన జగన్ కు అదే పరిస్థితి. అందుకే మండలిరద్దుకు నిర్ణయించారు. ఇఫ్పుడు జగన్ దీన్ని పార్లమెంట్ లో ఆమోదించుకోవాల్సి ఉంటుంది. కేంద్రం తో సఖ్యత ఉండడంతో సాధ్యమే. కానీ ఇప్పటికిప్పుడు మండలిరద్దు బిల్లును పార్లమెంట్ టేకప్ చేసే పరిస్థితి లేదు. కేంద్ర బడ్జెట్, కీలక బిల్లులు, సీఏఏ, ఎన్నార్సీ దుమారం ఉండడం తో ఏపీ శాసనమండలి బిల్లు వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు వచ్చే చాన్స్ ఉంది. మోడీ సర్కారు ఇప్పటికిప్పుడు మండలి రద్దును పార్లమెంట్ లో ఈ ఫిబ్రవరి సెషన్ లో పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేవని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.