Begin typing your search above and press return to search.

కొత్త క్యాబినెట్ కొలువు తీరేది ఆ రోజే...?

By:  Tupaki Desk   |   26 March 2022 6:57 AM GMT
కొత్త క్యాబినెట్ కొలువు తీరేది ఆ రోజే...?
X
ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 11న కొత్త మత్రులు ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. ఆ రోజు అన్ని విధాలుగా తిధులు, ఇతర ఘడియలు బాగున్నాయని నిర్ధారిస్తున్నారు.

ఇక బడ్జెట్ సెషన్ కూడా ముగియడంతో జగన్ మంత్రి వర్గం కూర్పు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అని తెలుస్తోంది. కొత్త మంత్రుల ఎంపిక విషయంలో ఏ విధమైన పొరపాట్లూ లేకుండా రాజకీయంగా ప్రాంతీయంగా, సామాజికవర్గ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఒకటికి పదిసార్లు సమీక్షించుకుని మరీ కొత్త మంత్రులను ఎంపిక చేస్తారు అని తెలుస్తోంది.

ఇక కొత్త మంత్రులుగా ఎవరు ఉండాలన్నది ముఖ్యమంత్రి ఇష్టమే అయినా ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ముఖ్యమంత్రికి ఇది కత్తి మీద సాము వ్యవహారమే అని అంటున్నారు. ఎవరికి పదవి ఇచ్చిన ఎవరిని తప్పించినా అది తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది.

అందువల్ల ఆచి తూచి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఆశావహులను ఆయన పిలిపించుకుని మాట్లాడి ఏ కారణం చేత మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నామో తెలియచేస్తారని అంటున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా చాలా మటుకు అసంతృప్తి రాకుండా ఉంటుందని ఆశిస్తున్నారు.

ఇక ఫ్యూచర్ లో మంచి అవకాశాలు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి వారికి హామీ ఇస్తారని తెలుస్తోంది. అదే టైం లో మాజీలు అవుతున్న మంత్రులకు ఇంతకంటే పెద్ద బాధ్యతలుగా పార్టీని అప్పగించాలని జగన్ అనుకుంటున్నారు.

మీరే రేపటి రోజున పార్టీకి సారధులు, పార్టీని మళ్ళీ గెలిపిస్తే మీ మంత్రి సీటు మీకే అని ఇప్పటికే వారికి జగన్ చెప్పేశారు. ఎంతలా చెప్పినా ఎన్ని రకాలైన హామీలు ఇచ్చినా మంత్రివర్గ విస్తరణ అంటే అలకలు అసంతృప్తులు ఉండడం సహజం. మరి జగన్ వాటిని ఏ విధంగా అధిగమిస్తారు అన్నదే అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

మొత్తానికి చూస్తే ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అని దాదాపుగా వైసీపీలో ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగిపోతోంది. మరి న్యూ మినిస్టర్లు ఎవరు అన్నదే చూడాల్సింది ఉంది.