Begin typing your search above and press return to search.

మిస్టర్ మోడీ.. ఏపీ మీద ఎందుకు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు?

By:  Tupaki Desk   |   24 March 2021 4:52 AM GMT
మిస్టర్ మోడీ.. ఏపీ మీద ఎందుకు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు?
X
దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అందుకు భిన్నంగా కొన్ని రాష్ట్రాల విషయంలో వ్యవహరించే తీరుకు.. మిగిలిన రాష్ట్రాల విషయంలో వ్యవహరించే వైఖరిలోని తేడా ఎంతన్న విషయాన్ని లోక్ సభలో ఓపెన్ గా చెప్పేసిన ఏపీ ఎంపీ వైనం ఆసక్తికరంగా మారింది. మోడీ సర్కారును ఇంత నిర్మాణాత్మకంగా ఇటీవల కాలంలో ఎవరు తప్పు పట్టలేని కొరతను.. తాజాగా ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు తీర్చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలన్న మోడీ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. గుజరాత్ మీద ఉన్న ప్రత్యేక ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించారు. కేంద్ర సర్కారును ఆత్మరక్షణలో పడేశారు.

ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల్ని పునరుజ్జీవింప చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మార్చి 16న ఇదే సభలో వ్యాఖ్యానించారని.. కానీ.. అదంతా గుజరాత్ సంస్థల మీదనే ఉందన్నారు. అలాంటి ప్రేమను ఏపీ మీద ఎందుకు చూపించరంటూ ప్రశ్నించారు.

గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ రూ.8వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఖాయిలా పరిశ్రమ. ఎన్జీజీసీ రూ.13వేల కోట్లతో అందులో 80 శాతం వాటాల్ని కొనుగోలు చేసిందని.. గుజరాత్ లోని సంస్థలపై చూపించిన ప్రేమను విశాఖ ఉక్కు మీద ఎందుకు చూపించరంటూ ప్రశ్నించిన వైనం ఆసక్తికరంగా మారింది. సామాన్యులు సైతం.. ఔరా మోడీ సర్కార్ అనేలా విషయాన్ని ప్రస్తావించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడేలా తన వాదన వినిపించారు. కొన్ని రాష్ట్రాల విషయంలో మోడీ సర్కారు ప్రదర్శించే సవితి తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్లుగా తన వాదనతో చూపించిన రామ్మోహన్ నాయుడి ప్రసంగం బీజేపీనేతల్ని ఇరుకున పడేలా చేసింది.