Begin typing your search above and press return to search.

అమాత్యులకు ఆతిథ్యబాధ్యతలు మాత్రమే!

By:  Tupaki Desk   |   15 Oct 2015 4:41 AM GMT
అమాత్యులకు ఆతిథ్యబాధ్యతలు మాత్రమే!
X
అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమం విషయంలో చంద్రబబునాయుడు చాలా పక్కా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదేదో ప్రభుత్వం కార్యక్రమం అనేసుకుని.. మంత్రులు, తదితర ప్రభుత్వం పెద్దలు.. అక్కడకు వచ్చి అధికారుల మీద కర్రపెత్తనం చేయడానికి వీల్లేదు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు.. ఓ భారీస్థాయి పెళ్లిని తలపించే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోదస్త్రంఇ. ప్రభుత్వం మాత్రమే కాదు.. కేబినెట్‌ మంత్రులందరూ కూడా.. ఆడపెళ్లి వారి తరఫు పెద్దలన్నమాట. అంటే దానర్థం ఏమిటి? వీరు ఎవ్వరిమీదా కర్రపెత్తనం చేయడానికి వీల్లేదు. కేవలం బాధ్యతలను, పనులను పంచుకోవడం మాత్రమే.

చంద్రబాబునాయుడు ఈ మేరకు తన మంత్రి వర్గ సహచరులకు ఒక క్లారిటీ ఇచ్చేశారు. మంత్రులందరూ కూడా.. శంకుస్థాపనకు వచ్చే అతిథులు, ప్రత్యేకించి రైతులు, ఇతర ఆహూతులకు సంబంధించి స్వాగత సన్నాహాలు, వారికి వసతి సదుపాయాలు చూడడంలో వీసమెత్తు తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి పనులు పురమాయించారు. హెలిపాడ్‌ల వద్ద వీవీఐపీలకు స్వాగతం చెప్పడంనుంచి వారిని వేదిక వద్దకు తీసుకురావడమూ.. వేదికల వద్ద వదలి తిరిగి తర్వాత రాబోయే వారికి స్వాగతం చెప్పడానికి మళ్లీ హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లడమూ సాక్షాత్తూ మంత్రులే చేయాలి.

అంతే తప్ప వేదిక మీద ఆసీనులైన ఎవరేం పనిచేస్తున్నారా అని అజమాయిషీ చేసేందుకు లేదు. మంత్రులందరికీ ఇలా ఆతిథ్య బాధ్యతలను పంచేశారు. పైగా ప్రధాని ఉండబోయే ప్రధాన వేదిక మీద మంత్రులెవరికీ కూర్చునే అవకాశం కూడా లేదని తర్వాత అసంతృప్తులు రాకుండా చంద్రబాబు ముందే క్లారిటీ కూడా ఇచ్చేశారు. అంటే మన మంత్రులంతా కేవలం 'అతిథి దేవోభవ' అంటూ ఆతిథ్యంలోనే తరించాలన్నమాట.