Begin typing your search above and press return to search.

ఒక్క గుడినీ కూల్చమన్న ఏపీ మంత్రులు

By:  Tupaki Desk   |   3 July 2016 4:34 PM GMT
ఒక్క గుడినీ కూల్చమన్న ఏపీ మంత్రులు
X
నిరసల్ని పట్టించుకోలేదు. ఆందోళనల్ని లైట్ తీసుకున్నారు. తమ పవర్ ముందు.. ప్రజల నిరసనలు ఏముంది? అంటూ లైట్ తీసుకున్నారు. ఇలా తప్పుల మీద తప్పులు చేసిన ఏపీ సర్కారు చెంపలేసుకున్న పని చేసింది. అయితే.. ఏం లాభం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బెజవాడలోని పెద్ద ఎత్తున ఆలయాల్ని కూల్చేసిన తర్వాత ఏపీ మంత్రుల బృందం తాపీగా స్పందించింది. ప్రభుత్వం చేసిన తప్పుల్ని అధికారుల మీద వేసి.. వారి బలిపశువులు చేసే ప్రయత్నానికి తెర తీశారు ఏపీ మంత్రులు.

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంతో పాటు.. అభివృద్ధి కార్యక్రమాల పేరు చెప్పి ప్రజలు వ్యతిరేకిస్తున్నా వినకుండా రాత్రికి.. రాత్రే ప్రొక్లయిన్లతో దేవాలయాల్ని కూల్చి వేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ బీజేపీ నేతలు దేవాలయాల్ని కూల్చిన ప్రాంతాల్ని సందర్శించి.. ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు కూడా. దీనికి కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు పలువురు బీజేప నేతలపై కౌంటర్ ఎటాక్ కు దిగారు.

ఇదిలా ఉండగా ఏపీ మంత్రుల బృందం ఒకటి దేవాలయాల్ని కూల్చిన ప్రాంతాల్ని సందర్శించింది. ఈ కమిటీలో మంత్రులు మాణిక్యాలరావు.. ప్రత్తిపాటి పుల్లారావు.. దేవినేని ఉమామహేశ్వరరావు.. కామినేని శ్రీనివాసరావు.. కొల్లు రవీంద్రలు ఉన్నారు. కూల్చేసిన దేవాలయాలు.. గోశాలను పరిశీలించిన ఈ బృందం అనంతరం సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించింది. ఆనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

విజయవాడ నగరంలో ఉన్న ఆలయాల్ని ఒక్క అంగుళం కూడా కదిపే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసిన వారు.. ఏ దేవాలయాల్ని కూల్చేయరన్నారు. కూల్చేసిన ఆలయనాల స్థానే.. వాటిని తిరిగి నిర్మిస్తామన్న హామీ ఇచ్చారు. గోశాల నిర్వాహకులతో మాట్లాడి ఇష్యూను సెటిల్ చేస్తామన్న మంత్రుల బృందం.. పుష్కరాల పనుల్ని పూర్తి చేయాలన్న తొందరల్లో అధికారుల్లో కొందరు అత్యుత్సాహంతో వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న వారు.. కూల్చిన ఆలయాల్ని తిరిగి నిర్మిస్తామని.. హామీ ఇచ్చారు.అదే సమయంలో.. ఇకపై ఎలాంటి నిర్ణయాల్ని తీసుకున్నా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదేదో దేవాలయాల్ని కూల్చక ముందే.. ఈ తరహా నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండేది. కెలికి మరీ.. ప్రజాగ్రహానికి గురికావటం ఏపీ సర్కారుకు మాత్రమే సాధ్యమేమో..?