Begin typing your search above and press return to search.

మహిళలతో తిట్టించటమా రోజా? ఆ మాట మీరు అనటమేంది కామెడీగా!

By:  Tupaki Desk   |   28 May 2022 2:49 PM GMT
మహిళలతో తిట్టించటమా రోజా? ఆ మాట మీరు అనటమేంది కామెడీగా!
X
మనుషులు ఇంతేనేమో? తాము చేసిన పని చాలా గొప్పదిగా ఫీల్ అవుతారు. తాము చేసిన పనే ఎవరైనా చేస్తే మాత్రం కస్సుమంటారు. అరే.. నిద్ర లేచింది మొదలు మనం కూడా ఇదే పని చేస్తామన్న చిన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఈ మాటలు సరిగా అర్థం కావట్లేదా? విషయం మరికాస్త చెబితే అంతా అర్థమైపోతుంది.

ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజాకు ఈ రోజు కోపం వచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని వింటే దిమ్మ తిరిగిపోవటమే కాదు.. అదేంది రోజమ్మా.. మీరు ఇలా మాట్లాడితే ఎలా? అన్న భావన మనసులోకి రాక మానదు.

తాను ప్రాతినిధ్యం పార్టీ విషయంలో కఠినమైన విధేయతను ప్రదర్శించే రోజా.. సీఎం జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పటం లేదని.. ప్రజలే చెబుతున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్సం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మ రథం పట్టారన్న ఆమె.. ఏపీకి.. తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబేనని తిట్ట దండకాన్ని షురూ చేశారు. మహానాడు అని పెట్టి మహిళలతో నీచాతినీచంగా తమను తిట్టిస్తున్న ఘటనల్ని చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మామ ప్రాణాలు తీసిన చేత్తోనే దండం పెడుతున్న చంద్రబాబు ఎంతటి ఘనుడో మీకే తెలుసంటూ విషయంలోకి మీడియాను లాగిన ఆమె.. 14 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు చంద్రబాబు ఏమి చేయలేదన్నారు. సీఎం జగన్, మంత్రులైన మమ్మల్ని తిట్టడానికే మహానాడు పెట్టుకున్నారన్నారు. మిగిలిన మాటల్ని పక్కన పెడితే.. రోజా లాంటి ఫైర్ బ్రాండ్ మహిళా నేత నోటికి వచ్చినట్లు ఎంతలా మాట్లాడతారో తెలిసిందే. అలాంటి ఆమె.. మహానాడుకు వచ్చిన మహిళల చేత తిట్టిపోయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ఒకవేళ మంత్రి రోజా మాటలే నిజమని అనుకుందాం. మరి.. రోజా చేత తిట్లు తిన్న వారి పరిస్థితేంటి? రోజా దారుణ తిట్ల వెనుక కూడా ఆమె అభివర్ణించినట్లే చెప్పాలంటే.. ఎవరు ఉన్నట్లు? ఎవరో ఉంటే తప్పించి మహిళలు మాట్లాడలేరన్న భావనలోకి రోజా నోటి నుంచి రావటం సరైనదేనా? అన్నది ప్రశ్న. నిజంగా ఎవరో ఉండేటట్లు అయితే.. మరి ఆమె వెనుక ఎవరు ఉన్నట్లు? అన్న సందేహానికి సైతం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అంటారు.. ఆవేశం ఉండాలి కానీ హద్దులు దాటకూడదు. అలా దాటిన ప్రతిసారీ ఎదోఒక దెబ్బ తప్పదు. ఏపీ మంత్రి ఆర్కే రోజా ఈ సత్యాన్ని ఎప్పటికి తెలుసుకుంటారో?