Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే చుక్క‌లు!

By:  Tupaki Desk   |   4 Sep 2022 10:30 AM GMT
వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే చుక్క‌లు!
X
వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రికి రోజాకు సొంత పార్టీ వైఎస్సార్సీపీ నేత‌లే షాకిచ్చారని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులోనూ ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా న‌గ‌రిలోనే ఆమెకు షాక్ త‌గిలింద‌ని అంటున్నారు. న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంలో రోజాకు సొంత పార్టీలోనే తీవ్ర అస‌మ్మ‌తి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆమె గ‌త రెండు ఎన్నిక‌ల్లో గెలిచింది కూడా బొటాబొటీ మెజారిటీతోనే కావ‌డం గ‌మ‌నార్హం. అతి త‌క్కువ మెజారిటీ సాధించ‌డానికి కూడా అస‌మ్మ‌తి కార‌ణ‌మ‌ని చెప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌తంలో మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ తాను మ‌ద్ద‌తిచ్చిన వ్య‌క్తిని ఎంపీపీగా చేసుకోవ‌డానికి రోజా చెమ‌టోడ్సాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీలో కీల‌కంగా ఉన్న రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి, మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ కేజే కుమార్, ఆయ‌న భార్య‌ కేజే శాంతి, అమ్ములు త‌దిత‌రుల‌తో రోజాకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. రోజా మ‌ద్ద‌తు లేక‌పోయినా మ‌రో కీల‌క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మ‌ద్ద‌తుతో రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి శ్రీశైలం దేవ‌స్థానం చైర్మ‌న్ గా, కేజే శాంతి ఈడిగ‌ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు.

కాగా ప్ర‌తిపక్ష నేత‌ల‌పైనే కాకుండా త‌న నోటి దురుసును న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌ల‌పైనా రోజా చూపుతున్నార‌ని అంటున్నారు. ఈ నోటి దురుసే ఆమెకు మంత్రి ప‌ద‌వి రూపంలో మేలు చేస్తే.. సొంత పార్టీ నేత‌ల్లో కీడు చేస్తోంద‌ని చెబుతున్నారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ నేత‌ల‌ను ఎంత మాట ప‌డితే అంత‌మాట అంటున్నార‌ని.. దీంతో ఆమెపై అస‌మ్మ‌తి పెరుగుతోంద‌ని పేర్కొంటున్నారు. ఇలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజా ఓడిపోవ‌డం ఖాయ‌మేన‌ని చెబుతున్నారు.

ఈ క్రమంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖర‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగానూ నగరిలో మరోసారి వైఎస్సార్‌సీపీలో వర్గపోరు బయటపడింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను రోజా లేకుండానే ఆమె వ్యతిరేక వర్గం ఘ‌నంగా నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా అస‌మ్మ‌తి నేత‌లు ఏకంగా మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశార‌ని చెబుతున్నారు.

2014, 2019 ఎన్నిక‌ల్లో తామంతా మ‌ద్ద‌తిస్తేనే రోజా నగరిలో గెలిచారని పుత్తూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ అమ్ములు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎప్పుడూ రోజా ప్రజలకు అందుబాటులో లేర‌ని అమ్ములు ఆరోపిస్తున్నారు. రోజా వెనుక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలెవరూ లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ముఖ్య నేతల్లో ఒకరికే వ‌చ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాల‌ని డిమాండ్ వినిపించ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే రోజా ప్రజలకు అందుబాటులో ఉండ‌టం లేద‌నేది ఆమెపై మ‌రో ఆరోప‌ణ‌గా ఉంది. అలాగే కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఎవ‌రైనా ప‌ని కోసం వెళ్తే వారిపై నోటి దురుసు చూపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రోజా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సమయంలోనే నగరి నియోజవర్గంలో ఆమె లేకుండానే వైఎస్సార్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి త‌మ‌కే సీటు ఇవ్వాల‌ని శ్రీశైలం దేవ‌స్థానం చైర్మ‌న్, నిండ్ర మండ‌లానికి చెందిన‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, నగరి నుంచి కేజే కుమార్, ఆయ‌న భార్య ఈడిగ కార్పొరేష‌న్ చైర్మ‌న్ శాంతి కోరుతున్నార‌ని చెబుతున్నారు. అలాగే వడమాల పేట, విజయపురంల‌ నుంచి మురళీధర్ రెడ్డి, లక్ష్మీపతి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు టికెట్ రేసులో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. స్థానికులకే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలని సీఎం వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్ళామని కూడా అస‌మ్మ‌తి నేత‌లు చెబుతుండ‌టం విశేషం.