Begin typing your search above and press return to search.

బాబు 11 కోట్లు..చినబాబు 2.5 కోట్లు జీర్ణం

By:  Tupaki Desk   |   13 Feb 2019 5:34 AM GMT
బాబు 11 కోట్లు..చినబాబు 2.5 కోట్లు జీర్ణం
X
తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెడుతోంది. దిల్లీలో ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ఆర్భాటానికి రూ.11 కోట్లు ఖర్చు పెట్టడంపై నేషనల్ మీడియా అంతటా పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. అయినా, సిగ్గు లేకుండా ఏపీ ప్రభుత్వం మరో అడ్డగోలు ఖర్చుకు తెరతీసింది. ఈసారి సీఎం కుమారుడు - మంత్రి నారా లోకేశ్ సన్మానం కోసం రూ.2.5 కోట్ల అప్పనంగా ఖర్చు చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచే.

గత నాలుగున్నరేళ్ల కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారంటూ సంబంధిత ఉద్యోగులందరినీ సమావేశపరిచి బుధవారం మంత్రి లోకేష్‌‌ ను సన్మానించబోతున్నారు. ఉద్యోగులందరూ కృతజ్ఞతగా మంత్రికి సన్మానం చేస్తున్నారని పైకి చెబుతున్నా.. ఆ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలించేందుకు - సన్మాన సభకు అయ్యే ఖర్చు కోసం దాదాపు రూ. 2.5కోట్లను ఉపాధి హామీ నిధుల నుంచి వెచ్చించాలని మంత్రి లోకేష్‌ కార్యాలయం సూచించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లతో పాటు మండల - జిల్లా స్థాయిలో పనిచేసే దాదాపు 15 వేల మందిని తరలించేందుకు ఉపాధి నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సన్మానం కాగా.. బుధవారం ఉదయమంతా వారిని రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించేలా విహార యాత్రలు ఏర్పాటు చేశారు. విహార యాత్ర అనంతరం ఉద్యోగులంతా సన్మాన కార్యక్రమానికి హాజరై ‘థ్యాంక్యూ లోకేష్‌ గారూ!’ అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయాలట. అయితే... లోకేష్‌ సన్మాన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా పాల్గొనాలని - ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపుపై మంత్రి ప్రకటన చేస్తారని అధికారులు ఆశ పెట్టారు. దీంతో ఇష్టమున్నా లేకున్నా అంతా బయల్దేరి వస్తున్నారు.

నిజానికి ఉపాధి హామీ పథకంలో దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అక్కడ ఎలాంటి ఆర్భాటాలు ఉండకూడదని పథకం నిబంధనల్లో ఉంది. అంతేకాదు.. ఈ పథకానికి కేంద్రం నుంచే 90 శాతం నిధులొస్తాయి. అలాంటప్పుడు లోకేశ్ చేసిందేమిటో మరి. కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన పనులకు లోకేశ్ బాబు సన్మానం చేయించుకుంటున్నారన్నమాట. అదికూడా 2.5 కోట్లు ఖర్చు చేసి.