Begin typing your search above and press return to search.

బీజేపీలో టీడీపీ విలీనం తథ్యమట!

By:  Tupaki Desk   |   18 July 2021 11:37 PM IST
బీజేపీలో టీడీపీ విలీనం తథ్యమట!
X
ఫైర్ బ్రాండ్, మాటల తూటాలు పేల్చగల ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, టీడీపీపై హాట్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం చంద్రబాబు అదే ప్రయత్నాల్లో ఉన్నారని.. తమకు ఆ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని.. టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొడాలినాని ఆరోపించారు. లోకేష్ ఏం చేయలేడనే విషయం తెలిసి బీజేపీలో విలీనం దిశగా చంద్రబాబు వెళుతున్నాడని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

2024లో టీడీపీ జగన్ కు పోటీ ఇవ్వలేదనే విషయం చంద్రబాబుకు తెలుసు అని అన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదనే విషయం బాబుకు తెలుసు అని అన్నారు. అందుకే బీజేపీతో మాట్లాడుకొని విలీనం కోసం ప్రయత్నిస్తున్నాడని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల వ్యక్తులు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటుంటే చంద్రబాబు, లోకేష్ మాత్రం పనిలేకుండా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. నిజంగా చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి విలీనం జరిగితే ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రం.. నక్కజిత్తుల రాజకీయాలు వదిలిపోతాయని నానా ఎద్దేవా చేశారు.

కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని కులాల వాళ్లకు జగన్ సముచిత స్తానం ఇచ్చారని కొడాలి నాని అన్నారు. కార్పొరేషన్లు ఉంటే ఆయా కులాల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనేది జగన్ ఆలోచన అన్నారు. ఇదే పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని అన్నారు. అప్పట్లో ఆ పని చేయకుండా ఇప్పుడు జగన్ పై ఏడుపు మొదలు పెట్టారని విమర్శించారు.

బాబు -లోకేష్ కలిసి ఇంకేమైనా పనిచూసుకుంటే బెటర్ అని నాని స్పష్టం చేశారు. ఉన్నతమైన ఆశయాలు, విలువలతో నడుచుకుంటున్న సీఎంపై బురదజల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు.