Begin typing your search above and press return to search.

బాబు మీద‌ కస్సుబుస్సు : సారా వ్యాపారి కామెంట్ అంత హర్ట్ చేసిందా...?

By:  Tupaki Desk   |   19 Jun 2022 7:30 AM GMT
బాబు మీద‌ కస్సుబుస్సు : సారా వ్యాపారి కామెంట్ అంత హర్ట్ చేసిందా...?
X
ఎవరైనా హర్ట్ అయ్యే మాటలు కొన్ని ఉంటాయి. రాజకీయాల్లో ఏమి అన్నా చెల్లిపోతుంది అన్న కాలం ఇది. ఒకనాడు వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదు. కానీ ఇపుడు అంతా రివర్స్ లో ఉంది. బూతులు మాట్లాడితే మంత్రి పదవి వస్తున్న చేటు రోజులు దాపురించిన తరువాత నైతికత, మంచి మాటలు అన్న వాటి గురించి అసలు ఆలోచించడం లేదు. ఇక చంద్రబాబు కూడా తన స్టైల్ మార్చారు. పంచ్ డైలాగులు పేలుస్తూ ఆయన వైసీపీ మంత్రుల మీద నేతల మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు.

ఆయన ఏకంగా విజయన‌గరం జిల్లా టూర్ లో బొత్స ఇలాకా అయిన చీపురుపల్లి వెళ్ళి మరీ సారా వ్యాపారికా విద్యా మంత్రి పదవి అంటూ భారీ డైలాగ్ వదిలారు. అది ఎక్కడ తగాలాలో అక్కడ బొత్సకు తగిలిందిట. ఆయన పూర్వాశ్రమంలో సారా వ్యాపారి అని చెబుతారు. ఇపుడు ఆయన తరఫున ఉన్న వారు ఎవరైనా ఆ పని చేస్తున్నారో ఏమో తెలియదు కానీ బొత్సను ఇంకా సారా వ్యాపారి అనే విపక్షాలు చాన్స్ దొరికినప్పుడల్లా కామెంట్స్ చేస్తాయి.

అయితే చంద్రబాబు ఎపుడూ ఈ మాట అనలేదు. కానీ అంతటి పెద్ద నాయకుడు తన సొంత నియోజకవర్గం వచ్చి తనను అలా కించపరచేసరికి బొత్స సార్ కి ఎక్కడ లేని ఆవేశం కట్టలు తెంచుకుంది. అసలు చంద్రబాబుకు మెదడు ఉందా అంటూ బొత్స రివర్స్ అటాక్ చేశారు. ఆయన ఖాళీగా కూర్చోవడం వల్ల బుర్ర చెడిపోయిందని గట్టి డైలాగునే వాడారు. అంతే కాదు దేశంలో పనికిమాలిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారూ అంటే అది చంద్రబాబు మాత్రమే అని బొత్స మండిపడుతున్నారు.

ఎపుడూ అధికారం కోసమే తాపత్రయం తప్ప చంద్రబాబుకు ఏమీ తెలియదని, ఇక అధికారం కోసం ఎందరి చంకలు నాకాలో అన్నీ నాకేసిన పెద్ద మనిషి ఆయనే అంటూ బొత్స సత్తిబాబు మాటల దూకుడు చేసి మరీ బాబుకు చాకిరేవు పెట్టేశారు. బైజూస్ అంటే జ్యూస్ అని చంద్రబాబు సెటైర్లు వేస్తున్నారు అని అది ఆయన గారి హెరిటేజ్ లో దొరికే మామూలు జ్యూస్ కాదని తెలుసుకోవాలని కూడా చురకలు వేశారు.

ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదువుకుంటే ఓర్వలేని తనం బాబుదని అన్నారు. వైసీపీ ఏలుబడిలో బీసీలు ఎక్కువగా పదవుల్లో ఉన్న విజయనగరంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడం బాబుకే చెల్లిందని అన్నారు. చంద్రబాబు పని అయిపోయింది కాబట్టే ఎక్కువగా మాట్లాడుతున్నారు అని కూడా బొత్స కౌంటర్లేశారు. విశాఖ అభివృద్ధి అంతా వైఎస్సార్ చలువ అని ఆ సంగతి బాబుకు తెలియదా అని ప్రశ్నించారు.

మొత్తానికి బొత్స చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఆయన బాధలు ఆయనివి. మంత్రి పదవి దక్కింది కానీ సరైన శాఖ ఇవ్వలేదు అన్న ఆవేదన అయితే ఉంది. విద్యా శాఖ మీద ఆయనకు అసంతృప్తి ఉంది. ఈ నేపధ్యంలో విపక్షాలు బొత్సకు ఆ శాఖ ఏంటి అని వెటకారం చేస్తున్నాయి.

ఇపుడు చంద్రబాబు సారా వ్యాపారం చేసుకునే వారిని విద్యా శాఖ ఇస్తే ఇలాగే ఉంటుంది అంటూ పంచ్ డైలాగ్ వేయడంతో ఎక్కడ లేని ఆవేశం బొత్సకు తన్నుకు వచ్చింది అంటున్నారు. ఏది ఏమినా బొత్స చాలా కాలానికి చంద్రబాబు మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. అది కూడా హార్ష్ గానే మాట్లాడారు, అయితే బొత్స మాటలలో ఫ్ర‌స్ట్రేషన్ తో పాటు అనేక బాధలు కూడా ఇమిడి ఉన్నాయని తమ్ముళ్ళు సెటైర్లు వేయడమే బిగ్ ట్విస్ట్.