Begin typing your search above and press return to search.

ఓవర్ టూ బొత్స : వీక్ అయ్యారా...చేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   17 Jun 2022 5:30 AM GMT
ఓవర్ టూ బొత్స : వీక్ అయ్యారా...చేస్తున్నారా...?
X
ఉత్తరాంధ్రా యాసలో మాట్లాడుతూ పక్కా లోకల్ లీడర్ కి మారు పేరుగా ఉంటారు ఆయన. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన సొంత టాలెంట్ తోనే ఆయన ఈ రోజు ఏపీలోని టాప్ లెవెల్ లీడర్స్ లో ఒకరిగా ఉన్నారు. ఆయనే మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన చాలా సాదాసీదా కుటుంబం ఉంచి వచ్చారు. పూసపాటి రాజులు విజయనగరంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్ కాలేజిలోనే ఆయన చదివారు. ఒక ఏవరేజి స్టూడెంట్ గానే ఉన్నా నాయకత్వ లక్షణాలు మాత్రం నాడే పెంపొందించుకున్నారు.

అప్పట్లో కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న సాంబశివరాజు వద్ద చేరి రాజకీయ ఓనామాలు దిద్దారు. చాలా తక్కువ టైమ్ లో ఆయన ప్రియ శిష్యునిగా మెప్పు పొందారు. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ బ్యాంక్ కి ఎన్నికలు జరిగితే చైర్మన్ గా బొత్స గెలిచి సత్తా చాటారు. అది మొదలు బ్యాంక్ రాజకీయాలను ఔపాసన పట్టేసి జిల్లా నాయకుడిగా వెలుగొందారు.

నాటి నుంచి కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయి పెద్దల ప్రాపకం సంపాదించి బొత్స జిల్లాలో ప్రముఖ నేతగా ఉంటూ వచ్చారు. ఇక వైఎస్సార్ రాజకీయాల్లో జోరు పెంచితే ఆయన అడుగుజాడలలో నడుస్తూ బొత్స కూడా ఎదిగారు. మొత్తానికి ఆయన కాంగ్రెస్ లో పలు మాలు మంత్రిగా ఒకసారి ఎంపీగా గెలిచి తన హవాను చాటుకున్నారు.

ఆయన ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ వంటి కీలకమైన పదవులు నిర్వహించారు. ముఖ్యమంత్రి పదవి కూడా తృటిలో తప్పిపోయింది. ఇక 2014లో విభజన తరువాత కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి చీపురుపల్లి నుంచి పోటీ దేసి టీడీపీతో ధీటుగా ఓట్లు తెచ్చుకుని రెండవ స్థానంలో నిలిచారు. ఆ తరువాత భేషజాలు విడిచిపెట్టి మరీ వైసీపీలో చేరిపోయారు.

అయిదేళ్ళ పాటు జిల్లా వైసీపీ రాజకీయాలను అంతా తన కనుసన్నలలో నడిపిన బొత్స దానికి తగిన ఫలితాలను సాధించారు. 2019 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం తొమ్మిది స్థానాలు ఒక ఎంపీ సీటుని కూడా వైసీపీ గెలుచుకుంది. అయితే 2024లో పరిస్థితులు అలా ఉంటాయా అన్నదే ఇక్కడ చర్చ. బొత్స సీనియర్ నేతగా మంత్రిగా హవా చూపుతున్నా గతంలో కంటే ఆయన పొలిటికల్ గా వీక్ అయ్యారని అంటున్నారు.

ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు నుంచే ఆయనకు పోటీ ఎదురవుతోంది అంటున్నారు. మజ్జి శ్రీనివాసరావు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా జెడ్పీ చైర్మన్ గా చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలను తన వెంటే తిప్పుకుంటున్నారు. మరో వైపు బొత్సకు సొంత నియోజకవర్గం చీపురుపల్లి షాక్ ఇచ్చేలా ఉంది అంటున్నారు.

అక్కడ టీడీపీ యువ నేత కిమిడి నాగార్జున గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినా 62 వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకున్నారు అంటే అది ఆయన కుటుంబం బలం అని చెప్పాలి. టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు తమ్ముడు కుమారుడే నాగార్జున. అలాగే ఆయన తల్లి మాజీ మంత్రి కిమిడి మృణాళిని. దాంతో పాటు నాగార్జున పల్లె నిద్రలు చేస్తూ గ్రామాలలో తిరుగుతూ బొత్సకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్నారు.

అలాగే వైసీపీలో బలమైన నాయకులను ఈ మధ్య టీడీపీ వైపు లాగేసి గట్టి షాక్ ఇచ్చారు. ఇపుడు చంద్రబాబు సైతం బొత్స ఇలాకా మీద దృష్టి పెట్టారు. ఆయన జిల్లా పర్యటనలో రోడ్ షో కూడా బొత్స సీటు అయిన చీపురుపల్లిలోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ చేశారు. బొత్స వంటి బలమైన బీసీ నేతను ఢీ కొడితే జిల్లా మొత్తం టీడీపీ కంట్రోల్ లోకి వస్తుంది అన్నది టీడీపీ ప్లాన్.

వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గం వైపే బొత్స చూసుకునేలా టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. ఇంకో వైపు వైసీపీలో వర్గ పోరు, ఎమ్మెల్యేలు మాట వినకపోవడంతో బొత్స విసిగిపోయారు అంటున్నారు. అలాగే ఆయనకు జగన్ కీలకమైన మంత్రిత్వ శాఖను ఇవ్వలేదు అన్న అలక కూడా ఉంది. ఇవన్నీ కలసి బొత్స జోరు తగ్గించారు. దాంతో ఇపుడు ప్రత్యర్ధులు స్పీడ్ చేస్తున్నారు. మరి బొత్స 2024లో గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తారా. ఆ మ్యాజిక్ ని కంటిన్యూ చేయగలరా అంటే చూడాల్సి ఉంది. టీడీపీ అయితే జిల్లాలో బాగా పుంజుకుంది. బొత్స కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వీక్ అయ్యారని అంటున్నారు.