Begin typing your search above and press return to search.

టెన్త్ రిజల్ట్స్ : విద్యా మంత్రి బొత్స పాస్...?

By:  Tupaki Desk   |   5 Jun 2022 12:56 PM GMT
టెన్త్ రిజల్ట్స్ : విద్యా మంత్రి బొత్స పాస్...?
X
పదవతరగతి పరీక్షలకు 2022 ఏడాది చాలా గుర్తుండిపోయే ఏడాదిగా ఉంటుంది. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. రెండేళ్ల పాటు వరసగా కరోనాతో పరీక్షలు జరగని పరిస్థితి. అంతే కాదు వైసీపీ ఏలుబడి వచ్చాక తొలిసారి నిర్వహించిన పరీక్షలు ఇవి. ఇక ఈ పరీక్షల నిర్వహణలలో అవకతవకలు లీకేజిలు ఇవన్నీ కూడా ఒక పెద్ద సంచలనమే నమోదు చేశాయి.

దానికి సంబంధించి విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ఒక బిగ్ ట్విస్ట్. ఇక ఈ పరీక్షలు మరో పదిహేను రోజులలో జరుగుతాయి అనగానే మూడేళ్ళుగా ఆ శాఖను చూస్తున్న విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ మారిపోవడం ఒక కీలక ఘట్టం అయితే, తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ అనుకోని అసలు ఊహించని శాఖతో బొత్స సత్యనారాయణ అనబడే సీనియర్ మళ్లీ బడికి వెళ్ళడం ఇంకా బిగ్ ట్విస్ట్.

ఇక ఆయన అలకలు, కోపాల తాపాల మధ్య పదవతరగతి పరీక్షల పదనిసలు ఇన్నీ అన్నీ కావు. పోనీలే ఏదోలా పూర్తి అయ్యాయి అనుకుంటే రిజల్స్ట్స్ విషయంలోనూ మొదట చెప్పిన తేదీని మార్చి వాయిదా వేసి ఎన్నడూ లేని విధంగా ట్విస్టులకే ట్విస్ట్ ఇచ్చి విద్యా శాఖ విద్యార్ధులను, తల్లిదండ్రులను షాక్ కొట్టించింది.

ఈ టోటల్ ఎపిసోడ్ వెనక రాజకీయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లోకేష్ అయితే ఇందులోనూ పాలిటిక్సేనా అని చెడుగుడు ఆడేశారు. ఇక సీనియర్ మంత్రి విద్యాశాఖకు ఉండగా అధికారులు పరీక్షా ఫలితాలు రిలీజ్ చేస్తారని ప్రకటించడం అతి పెద్ద విడ్డూరం. మరి దీని వెనక ఎవరున్నారో ఏమిటి అన్న సంగతి పక్కన పెడితే సడెన్ గా పరీక్షా ఫలితాలు వాయిదా వేయడం వెనకా కొన్ని హస్తాలు ఉన్నాయని ప్రచారం సాగింది.

ఇక అన్నీ కూడా నలభై ఎనిమిది గంటల వ్యవధిలో సర్దుకున్నాయి. విద్యా మంత్రిగా బొత్స సత్యనారాయణ ఫస్ట్ టైమ్ టెన్త్ పరీక్షా ఫలితాలను విజయవాడలో రేపు విడుదల చేస్తారు. అంటే శనివారం అధికారుల చేతుల మీద విడుదల కావాల్సిన ఫలితాలు సోమవారం నాటికి మంత్రి చేతుల మీదుగా రిలీజ్ చేయబ‌డతాయి అన్న మాట. టెన్త్ లో ఎవరు ఫస్ట్ మార్కులు పొందారు, ఏమిటీ అన్నది పక్కన పెడితే బొత్స మాత్రం ఈ టోటల్ ఎపిసోడ్ లో పాస్ అయ్యారు. ఇంతకీ ఆయన లేకుండా ఫలితాలను రిలీజ్ చేయడానికి ప్రయత్నం ఎందుకు జరిగింది. ఏమిటీ ఆ కధ అన్నది అయితే ఇపుడిక ఎవరికీ తెలియనవసరం లేదు కూడా.