Begin typing your search above and press return to search.

మంత్రి బొత్సపై ట్విట్టర్ లో ఫేక్ సమాచారం.. వైరల్

By:  Tupaki Desk   |   1 May 2022 6:01 AM GMT
మంత్రి బొత్సపై ట్విట్టర్ లో ఫేక్ సమాచారం.. వైరల్
X
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్ లోని తన ఇంట్లో నిజంగా కరెంట్ బిల్లు కట్టలేదా? ఆయన గత 15 నెలలుగా కరెంట్ బిల్లు కట్టలేదని.. అందుకే విద్యుత్ శాఖ అధికారులు ఆయన ఇంటికి కరెంట్ కట్ చేశారని TSSPDCL ప్రకటించినట్టుగా సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది. అయితే దీనిపై అసలు నిజాలు తాజాగా బయటకు వచ్చాయి.

ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు సరిగా లేవని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇటీవల ఏపీ మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ నుంచే వచ్చానని.. అక్కడి తన ఇంట్లో కరెంట్ లేకుంటే జనరేటర్ వేసుకున్నానని ఎద్దేవా చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ కూడా ధీటుగా సమాధానమిచ్చాడు. 'బొత్స' కరెంట్ బిల్లు కట్టలేదేమో అందుకే తీసేశారు.. హైదరాబాద్ లో కరెంట్ ఎప్పుడూ పోదని హితవు పలికారు.

ఇక బొత్స చేసిన ఈ కౌంటర్ కు తాజాగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చినట్టుగా ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే ఈ పోస్ట్ ఫేక్ అని 'తుపాకీ.కామ్' ముందే అభిప్రాయపడింది. ఆ ట్విట్టర్ అకౌంట్ ఫేక్ గా ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే నిజమైంది.

TSSPDCL పేరుతో బొత్స సత్యనారాయణకు కౌంటర్ గా ఓ ట్విట్టర్ ఖాతాలో ఏప్రిల్ 30న ఓ ట్వీట్ చేసినట్టు ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. 'బొత్స గారు.. మీరు కరెంట్ బిల్లు 15 నెలల నుంచి కట్టడం లేదు. అందుకే కరెంట్ కట్ చేశాం.. కరెంట్ బిల్లులను కట్టేస్తే వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తాం' అని ఆ ట్విట్టర్ అకౌంట్ లో ఉంది.

మంత్రి బొత్స కరెంట్ బిల్లు కట్టలేదని ట్వీట్ చేసి ఉన్న ట్విట్టర్ అకౌంట్ TSSPDCL పేరుపైనే ఉన్నా దాన్ని @isocialsaint నిర్వహిస్తోంది. కానీ TSSPDCL అధికారికంగా నిర్వహిస్తున్న ఖాతా ఇది కాదని బయటపడింది. ఇది ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా కాదు. తెలంగాణ విద్యుత్ శాఖ నిర్వహించే TSSPDCL ఖాతాలో బొత్సపై ఎలాంటి ట్వీట్లు లేవు. ఇదొక నకిలీ ఖాతా అని తేలింది.

అచ్చం అధికారిక ట్విట్టర్ ఖాతాలాగానే కనిపిస్తోంది. TSSPDCL పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి ఇలా బొత్సకు ట్యాగ్ చేసి నకిలీ పోస్ట్ చేసినట్టు తేలింది. అయితే ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ నిజంగానే తెలంగాణ విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చిందని అందరూ భ్రమపడ్డారు.

ఈక్రమంలోనే TSSPDCLసంస్థ బొత్సకు కౌంటర్ ఇచ్చిందన్న వార్తలపై విద్యుత్ సంస్థ సీఎండీ రఘురామరెడ్డి స్పందించారు. ఈ వార్త బోగస్ అని.. సంస్థ ట్విట్టర్ ఖాతాలో ఎలాంటి ట్వీట్ చేయలేదని డిస్కం సీఎండీ రఘురామరెడ్డి తెలిపారు. సంస్థ పేరు మీద ఇలాంటి అసత్యప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థపేరుతో అసత్య ప్రచారం చేయవద్దని విన్నవించారు.



తెలంగాణ విద్యుత్ సంస్థ TSSPDCL అధికారిక ఖాతా