Begin typing your search above and press return to search.

బొత్సకు ధీటైన నేతను రెడీ చేస్తున్నారా... ?

By:  Tupaki Desk   |   20 April 2022 4:30 PM GMT
బొత్సకు ధీటైన నేతను రెడీ చేస్తున్నారా... ?
X
ఉత్తరాంధ్రాలో మంత్రి బొత్స సత్యనారాయణ అంటే రాజకీయంగా పలుకుబడి కలిగిన నేతగా చెబుతారు. ఆయనకు బలమైన సామాజిక వర్గం కలసి వచ్చింది. దాంతో మూడు దశాబ్దాలకు పైగా ఆయన తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన జగన్ తో కలిపి కరెక్ట్ గా నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసారు. దాదాపుగా పదిహేనేళ్ల పాటు మంత్రిగా ఉన్నట్లు అవుతోంది. ఇక బొత్స వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం బొత్సకు అవకాశాలు ఇస్తూనే విజయనగరం జిల్లాలో ఆయనకు ధీటైన కొత్త నాయకత్వాన్ని రెడీ చేస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది.

బొత్సకు ఎదురునిలిచే నాయకుడు ఎవరూ అంటే ఎక్కడో లేరు. ఆయన ఇంటి నుంచే వస్తున్నారు అని అంటున్నారు. ఆయనే చిన్న శ్రీను అనబడే మజ్జి శ్రీనివాసరావు. ఆయన ఎవరో కాదు, బొత్సకు సొంత మేనల్లుడు. ఆయన విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్ గా ప్రస్తుతం ఉన్నారు. ఒక విధంగా బొత్సకు ఆయన బ్యాక్ బోన్. జిల్లాలో చిన్న శ్రీను ఎంత చెబితే అంత. ఆయన మాటే వేదం. బొత్స రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉంటే విజయనగరం జిల్లాలో అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో చక్రం తిప్పేది చిన్న శ్రీను మాత్రమే. బొత్స అంతలా శ్రీను మీద ఆధాపడిపోయారు.

ఇక బొత్సకు ఉన్న రాజకీయ చాణక్యం, వ్యూహాలు ఎత్తులు అన్నీ డిటోకు డిటోగా చిన్న శ్రీనుకు పూర్తిగా అబ్బేశాయి. దాంతో యువకుడు అయిన చిన్న శ్రీనుకు పొలిటికల్ గా చాలా మంచి భవిష్యత్తు ఉందని అంటారు. ఇక జగన్ తన పాదయాత్రలోనే చిన్న శ్రీను ఫ్యూచర్ ని చాలా ఊహించేశారు. ఆయన చిన్న శ్రీనును నాడే దగ్గరకు తీశారు. విజయనగరం జిల్లాలో ఎక్కడ పోటీ చేస్తాను అన్నా సీటు ఇస్తానని జగన్ మాట ఇచ్చేశారు.

అయితే ముందు పార్టీ గెలుపే తన గెలుపు అని చిన్న శ్రీను జగన్ తో చెప్పి టికెట్ ఆశించకుండా పనిచేశారు. దాంతో జగన్ మరింతగా ముగ్దుడు అయ్యారని అంటారు. దాంతో చిన్న శ్రీనుకు ఏదైనా పదవి ఇవ్వాలని భావించి ఏడాది క్రితం జెడ్పీ చైర్మన్ పదవిని కేవలం ఆయనకే రిజర్వ్ చేసేశారు. వచ్చే ఎన్నికల్లో చిన్న శ్రీనుని ఎమ్మెల్యేగా గెలిపించుకుని జిల్లాలో కీలక నేతగా చేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతారు.

దానికి నాందిగా విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవిని చిన్న శ్రీనుకు జగన్ అప్పగించారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద పెత్తనం ఆయనకు అలా కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బరువు బాధ్యతలను చిన్న శ్రీను మీదనే పూర్తిగా పెట్టేశారు అన్న మాట. ఒక విధంగా బొత్స ఫ్యామిలీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కీలక పదవిని అప్పగించడం ద్వారా వైసీపీ హై కమాండ్ ఫ్యూచర్ పాలిటిక్స్ ని స్టార్ట్ చేసింది అంటున్నారు. బొత్సకు ధీటైన నేతను విజయనగరం జిల్లాలో తయారు చేయడానికే ఈ రకమైన ఎంపిక చేశారు అని అంటున్నారు.

ఇక బొత్స విషయం చూస్తే తన తరువాత తన కుమారుడు సందీప్ ని వారసుడిగా తీసుకురావాలని అనుకుంటున్నారు. దాంతో చిన్న శ్రీను సొంతంగా ఎదగాలని చూస్తున్నారు. జిల్లాలోని అందరి ఎమ్మెల్యేలతో కీలక నాయకులతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఏ విధంగా చూసుకున్నా అటు వైసీపీ హై కమాండ్ కి ఇటు చిన్న శ్రీనుకు ఈ నియామకం ఉభయ కుశలోపరిగానే ఉంది అంటున్నారు.

ఇక ఈ పరిణామాల పట్ల బొత్స వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తమ కుటుంబం అంతా ఒక్కటే అని ఇప్పటికి పలుమార్లు బొత్స చెప్పిన నేపధ్యం కూడా ఉంది. అయినా ఇది రాజకీయం. అందువల్ల కుటుంబ బంధాల కంటే కూడా చాలా విలువైనవి ఇక్కడ ఉంటాయని చరిత్రలో రుజువు అయింది. సో చిన్న శ్రీనుకి ఇచ్చిన ఈ పెద్ద పదవి ఏ రకమైన రాజకీయ అద్భుతలను విజయనగరం జిల్లాలో చేస్తుందో చూడాలి.