Begin typing your search above and press return to search.

బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ని బొత్స ! ఎందుకని ? ఈ దూరం !

By:  Tupaki Desk   |   19 April 2022 5:08 PM GMT
బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ని బొత్స ! ఎందుకని ? ఈ దూరం !
X
"ఎందుకీ దూరం
ఏమిటీ మౌనం"
అని మాత్రం అడ‌గ‌కండి ప్లీజ్ !
ఇలా అడిగితే బొత్స‌కు కోపం
అలా అడిగితే ఆయ‌న అనుచ‌రుల‌కు
కూడా కోపం..ఎవ‌రి కోపం ఎలా ఉన్నా
జ‌గ‌న్ మాత్రం బొత్స ప్ర‌తిపాద‌న‌ల‌కు నో
చెప్ప‌డ‌మే సిస‌లు ట్విస్ట్ !

ఆంధ్రప్ర‌దేశ్ లో మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌కు సంబంధించి ఇప్ప‌టికీ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. మామూలుగా క‌న్నా కాస్త మోతాదు ఎక్కువ ఉన్న స్థాయిలోనే వాదోప‌వాదాలు జ‌రుగుతున్నాయి. మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని వారు అల‌క పాన్పు ఎక్కారు.. త‌రువాత అధిష్టానం జోక్యంతో దిగివ‌చ్చి మేం అంతా జ‌గ‌న‌న్న వెంటే అని ఓ దీర్ఘం తీసి వెళ్లారు.

ఇదే స‌మ‌యాన కొంద‌రు మాత్రం ఇంకా అసంతృప్త‌వాదాన్ని వినిపిస్తూ గ‌గ్గోలు పెడుతూ ఉన్నారు. వారి గోల ఎలా ఉన్నా ఇవాళ కొత్త జిల్లాల‌కు వైసీపీ త‌ర‌ఫున పార్టీ అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఇదే స‌మ‌యాన బొత్స మ‌నిషి ఆయ‌న మేన‌ల్లుడు చిన్న శ్రీ‌ను ఎప్ప‌టిలానే విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మితులు అయ్యారు. కానీ బొత్స మాత్రం త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు అందుకునేందుకు మాత్రం ఇప్ప‌టికీ సిద్ధంగా లేరు.

గ‌త క్యాబినెట్ లో అంటే జ‌గ‌న్ 1.0 వెర్ష‌న్లో పుర‌పాల‌క శాఖ‌ను నిర్వ‌హించిన బొత్స స‌త్య‌నారాయ‌ణ తిరిగి అదే శాఖ త‌న‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న‌కు అప్ప‌గించిన విద్యాశాఖకు సంబంధించి బాధ్య‌త‌లు అందుకోవ‌డంలో ఆయ‌న తాత్సారం చేస్తున్నారు. ఈ నెల 11న మంత్రిగా ప్ర‌మాణం చేసి, అంతఃక‌ర‌ణ శుద్ధితో ప‌నిచేస్తాన‌ని చెప్పి, రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ఉంటాన‌ని చెప్పి పాపం ఆయ‌న మాట మార్చేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

త‌న‌కు విద్యాశాఖ వ‌ద్ద‌ని కూడా అంటున్నార‌ని స‌మాచారం. గ‌తంలో బొత్స నిర్వ‌హించిన పుర‌పాల‌క శాఖ‌ను ఇప్పుడు ఆదిమూలపు సురేశ్ కు కేటాయించారు. అదేవిధంగా విస్తృతాధికారాలు ఎక్కువ‌గా ఉన్న విద్యా శాఖ‌ను సీనియ‌ర్ అయిన బొత్స అయితే నిర్వ‌హ‌ణ బాగుంటుంద‌ని జ‌గ‌న్ భావించారు.

దీంతో ఆయ‌న‌కు ఓ విధంగా మంత్రివ‌ర్గంలో ఈ సారి నో ఛాన్స్ అన్న మాట వినిపించినా, సీనియ‌ర్ కోటాలో పద‌వి కొట్టేసి బొత్స త‌న అదృష్టానికి తిరుగే లేద‌ని నిరూపించారు. అయినా కూడా ఆఖ‌రి నిమిషంలో బాధ్య‌త‌లు అందుకుని, విద్యాశాఖ‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించాల్సిన స‌మ‌యంలో ముందున్న కాలంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు స‌మ‌ర్థంగా నిర్వ‌హించాల్సిన స‌మ‌యంలో సీనియ‌ర్ అయిన బొత్స మొండికేస్తున్నారు అని స‌మాచారం.

ఇటీవ‌ల విద్యాశాఖకు సంబంధించి సీఎం స‌మీక్ష చేప‌ట్టినా కూడా బొత్స మాత్రం గైర్హాజ‌ర‌య్యార‌న్న వార్త‌ల‌ను ప్ర‌ధాన మీడియా వెలుగులోకి తెచ్చి ఇష్యూని మ‌రింత హైలెట్ చేస్తోంది. మీడియా కు ఉన్న దృష్టికోణం ఎలా ఉన్నా కూడా బొత్స దృక్ప‌థ‌మే ఇప్పుడొక ప్ర‌శ్న‌గా మారింది.