Begin typing your search above and press return to search.

ఒక్క బొత్స...ఎన్నో డౌట్లు...?

By:  Tupaki Desk   |   14 April 2022 11:39 AM GMT
ఒక్క బొత్స...ఎన్నో డౌట్లు...?
X
ఆయన సామాన్యమైన నాయకుడిగా కనిపించే అసమాన్యుడు. విజయనగరాన రాజుల కోటలో చక్రం తిప్పి తన రాజకీయాన్ని పండించుకున్న కామన్ మ్యాన్ గా బొత్స సత్యనారాయణను చెప్పుకోవాలి. ఆయనకు రాజకీయ నేపధ్యం ఏమీ లేదు. అర్ధ బలం అంత కంటే లేదు. కానీ తన బుద్ధి బలంతో పాటు కుల బలాన్ని దానికి జోడించి ఎందరో ఉద్ధండులను ఉత్తరాంధ్రాలో ఎదుర్కొన్న నేత బొత్స. ఆయన రాజకీయాన్ని కాదనే పరిస్థితి జగన్ లాంటి వారికి కూడా లేకుండా పోయింది అంటేనే బొత్స ఈజ్ గ్రేట్ అనుకోవాలి.

మొత్తానికి బొత్స జగన్ మలి విడత విస్తరణలో పదవిని సంపాదించారు. కానీ విద్యా శాఖను ఆయనకు కేటాయించారు. నిజానికి ఎందుకో ఈ శాఖ పట్ల బొత్స సుముఖంగా లేరు అని మొదటి నుంచి వినిపిస్తోంది. కానీ ఈ శాఖ తక్కువైనది ఏమీ కాదు, ఉన్నత విద్యా శాఖను, ప్రాధమిక విద్యా శాఖను కలిపి ఒకటిగా చేసిన పెద్ద శాఖ. ఇక జగన్ సర్కార్ విద్యా రంగానికి ప్రయారిటీ ఇస్తున్నందువల్ల చేతినిండా పని ఉన్న శాఖ.

సంస్కరణలు చేపట్టి భావి తరాలకు గుర్తుండిపోయే పనులు చేయవచ్చు. కేంద్రం సరిగ్గా ఇదే సమయంలో జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. దాంతో కీలకమైన శాఖగా దీన్ని అంతా ఇపుడు చూస్తున్నారు. కానీ బొత్సకు ఈ శాఖ నచ్చడంలేదు అని ప్రచారంలో ఉంటే అదే నిజమన్నట్లుగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.

ముఖ్యమంత్రి విద్యా శాఖ సమీక్ష నిర్వహిస్తే బొత్స గైర్ హాజర్ కావడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇపుడు నిజంగా ఆలోచిస్తే దేనికి సంకేతం అన్నదే చర్చగా ముందుకు వస్తోంది. బొత్స మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక విజయవాడలోనే ఉన్నారు. అయితే ఆయన గురువారమే విశాఖ వచ్చారు. మరి సమీక్షా సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇక తన సోదరుడి కుమార్తె వివాహా వేడుకల్లో బిజీ కాబట్టి అని బొత్స సీఎం పేషీకి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నా అది ఏమంత అతికినట్లుగా కనిపించడంలేదు. రెండు గంటల పాటు ఉండే సమీక్షకు అందునా విజయవాడలోనే మంత్రి ఉండగా వెళ్తే ఏం పోయింది అన్న మాటా ఉంది.

అయితే ఇక్కడ బొత్స ఇండికేషన్ సీఎం జగన్ కి ఇచ్చారు అని అంటున్నారు. తనకు నచ్చని శాఖ కాబట్టే తాను గైర్ హాజర్ అయ్యాను అని ఆయన చెప్పకనే చెప్పారు అని అంటున్నారు. అసమ్మతికి అదే సంకేతమని విపక్షాలు అంటున్నాయి. ఇక్కడ మరిన్ని ముచ్చట్లు కూడా చెప్పుకోవాలి. అవి యాదృచ్చికంగా జరిగాయా లేక మరోటా అన్నది చూస్తే బొత్స మంత్రిగా ప్రమాణం చేశాక ముందు గవర్నర్ వద్దకు వెళ్ళి నమస్కారం చేశారు. ఆ తరువాత సీఎం జగన్ వద్దకు వెళ్లారుట.

అంటే అందరు మంత్రులూ ముందుగా జగన్ కి నమస్కరించి వెళ్తే బొత్స తన రూటే సెపరేట్ అని అలా చేశారా లేక తాను సీనియర్ అని చెప్పుకోవడానికి చేశారా అన్న చర్చ ఆ రోజే నడిచింది. బహుశా ఇలాంటి చిన్న విషయాలు కూదా రాజకీయాల్లో ముఖ్యమే అవుతాయని అంటున్నారు. ఇక మంత్రులు అందరూ తమ రాజీనామాలు సీఎం జగన్ కి ఇచ్చాకా బొత్స తన చాంబర్ లో కొందరు మాజీ మంత్రులతో మీటింగ్ నిర్వహించడం కూడా వైసీపీ హై కమాండ్ దృష్టిని దాటిపోలేదు అని అంటున్నారు.

ఇవి ఈ మధ్య జరిగిన విషయాలు అయినా దాని కంటే ముందు మూడేళ్ల మంత్రిత్వంలో బొత్స స్వేచ్చగానే ఎపుడూ మాట్లాడుతూ వచ్చారు. ఆయన సీనియర్ కాబట్టి తన హవాను అలా చాటుకున్నారు. మొదటి విడతలో బొత్సకు మునిసిపల్ శాఖను ఇచ్చారు. ఇంకా కీలకమైన శాఖలు ఉన్నా ఆ శాఖ ఇవ్వడమేంటని కూడా నాడు చర్చ జరిగింది. పైగా ఉప ముఖ్యమంత్రి హోదా మీద ఆశలు పెట్టుకున్నా నాడూ నేడూ ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఆయనకు ఉందని అంటారు.

ఇక ఆ మధ్య విపక్ష నాయకులు కూడా బొత్సకు వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత శాఖలు దక్కలేదని సానుభూతి చూపించారు. ఇపుడు విద్యా శాఖ ఇవ్వడంతో వారు మరింతగా బొత్స పట్ల మరింత ప్రేమతో మాట్లాడుతున్నారు. ఇక ఇపుడు గంటా లాంటి నాయకుడు బొత్స గైర్ హాజర్ దేనికి సంకేతం అని అంటున్నారు అంటే ఆయనకు ఆ సంకేతం వెనక ఉన్న కోడ్ భాష అర్ధమై ఉంటుందనే అంటున్నారు.

బొత్స ఉత్తరాంధా లీడర్, పైగా కాపు నేత, గంటా కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత. దాంతో పాటు కాపులను ఏకీకృతం చేసే పనులు ఒక వైపు జోరుగా సాగుతున్న నేపధ్యం ఉంది. మరి ఇవన్నీ చూస్తూంటే బొత్స గైర్ హాజరు మీద అయితే డౌట్లు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఆయన ఈ రోజుకీ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించకుండానే తన సొంత జిల్లాకు వచ్చేశారు. మరి ఇది కూడా కీలకమైన పాయింటే. బొత్స వైఖరి ఎలా ఉంటుంది. రానున్న రోజుల్లో ఎలా అడుగులు వేస్తారు అన్నది చూడాలి మరి.