Begin typing your search above and press return to search.

బడి సమీక్షకు బొత్స గైర్ హాజర్...ఎందువల్ల... ?

By:  Tupaki Desk   |   13 April 2022 5:30 PM GMT
బడి సమీక్షకు బొత్స గైర్ హాజర్...ఎందువల్ల... ?
X
ఆయన సీనియర్ మంత్రి. ఫ్లాష్ బ్యాక్ లో చాలా కీలకమైన శాఖలే చూశారు. ఇపుడు ఆయనకు బడి శాఖ దక్కింది. అదే విద్యా శాఖ. దీని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త మంత్రివర్గం కొలువు తీరాక మొదటి సారి సమీక్ష చేశారు. దానికి సంబంధిత శాఖ మంత్రిగా హాజరు కావాల్సిన బొత్స డుమ్మా కొట్టేసారు. అంటే తొలి సమీక్షకే అలా చేశారన్న మాట.

దానికి కారణం ఏంటి అంటే తమ సోదరుడి కుమార్తె వివాహం ఉంది కాబట్టి హాజరు కావడంలేదని ముఖ్యమంత్రి ఆఫీస్ కే బొత్స సమాచారం ముందే ఇచ్చారుట. దాంతో బొత్స కొన్నాళ్ళ పాటు ఫుల్ బిజీ అన్న మాట. అది సరే కానీ మంచి రోజులు వరసబెట్టి ఉన్నాయి. మంత్రులు అంతా కూడా తమ శాఖలకు సంబంధంచి బాధ్యతలను స్వీకరించి రంగంలోకి దిగిపోతున్నారు.

కానీ బొత్స మాత్రం ఇంతవరకూ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించలేదు. ఇక్కడే కొత్త ఆలోచనలు వస్తున్నాయి. దానికి తోడు సమీక్షకు కూడా రాలేదు. ఆయన చెప్పినట్లుగా వ్యక్తిగత పనులు ఉండవచ్చు. అదే టైమ్ లో ఆయన తమ కుటుంబంతో కలసి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

ఇక బొత్స విద్యా శాఖ పట్ల అంత ఇష్టంగా లేరు అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఉత్తరాంధ్రాకు సంబంధించి చూస్తే అందరికీ అదిరిపోయే శాఖలు దక్కాయి. బొత్స వంటి సీనియర్ కి మాత్రం విద్యా శాఖ ఇచ్చారు. అయితే ఇది ప్రధానమైన శాఖగానే ఈ ప్ర‌భుత్వంలో ఉంది.

అయినా బొత్స వంటి వారికి కీలకమైన వేరే శాఖలు ఇస్తే బాగుండేది అన్నది అనుచరుల మాట. మరి ఈ కారణాలు ఏమైనా మనసులో ఉండి బొత్స డుమ్మా కొట్టారా అన్న చర్చ అయితే ఉంది. కానీ అక్కడ ఉన్నది జగన్. ఆయన అందరికీ శాఖలు తన విచక్షణ మేరకు కేటాయించారు. జూనియర్లకు మంచి శాఖలు ఈసారి దక్కాయి. యువకులను ముందు పెట్టి మరీ పని చేయించాలని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ వారికే ప్రయారిటీ శాఖలు దక్కాయి.

ఇక గుడివాడ అమరనాధ్ వంటి వారు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచినా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖలను జగన్ ఇచ్చారు. అలాగే ధర్మాన ప్రసాదరావుకు కీలకమైన రెవిన్యూ శాఖ దక్కింది. బూడి ముత్యాలనాయుడుకు అయితే ఏకంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. అలాగే ఉప ముఖ్యమంత్రిని కూడా చేశారు. దాంతో బొత్స వంటి సీనియర్ కి ప్రాధాన్యత తగ్గింది అని ఆయన అనుచరులు అనుకుంటే అనుకోవచ్చు. ఏది ఏమైనా బొత్స ఎపుడు బాధ్యతలు చేపడతారో మరెప్పుడు బడి శాఖకు వస్తారో చూడాలి.