Begin typing your search above and press return to search.

అయ్య‌న్న- గంటా లొల్లి సెట్ చేయ‌వా బాబు?

By:  Tupaki Desk   |   3 April 2018 5:28 AM GMT
అయ్య‌న్న- గంటా లొల్లి సెట్ చేయ‌వా బాబు?
X
అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు అధికార తెలుగుదేశంలో అంత‌కంత‌కూ ఎక్కువైపోతున్నాయి. నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న ర‌చ్చ‌కు చెక్ చెప్ప‌ని అధికార ప‌క్ష అధినేత తీరుతో మ‌రింత ముదిరిపోతున్నాయి. విశాఖ జిల్లాలో ఏపీ మంత్రులు గంటా.. అయ్య‌న్న మ‌ధ్య అధిప‌త్య‌పోరు ఎంత‌లా ఉంటుంద‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌.

వీరిద్ద‌రి పుణ్య‌మా అని.. పార్టీ ప్ర‌తిష్ఠ అంత‌కంత‌కూ త‌రిగిపోతున్నా.. అధినేత బాబుకు మాత్రం ప‌ట్ట‌టం లేదు. ఇప్ప‌టికే ప‌లుమార్లు వీరిద్ద‌రి విభేదాలు ముదిరి బ‌జారున ప‌డ‌టం.. ప్ర‌భుత్వ‌..పార్టీ పర‌ప‌తి దెబ్బ తిన్న‌ప్ప‌టికీ చ‌ర్య‌లు విష‌యంలో బాబు ధైర్యంగా అడుగు వేయ‌ని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు మ‌రోసారి రోడ్డు మీద ప‌డ్డాయి.

తాను చెప్పిన‌ట్లుగా 24 గంట‌ల్లో చేయ‌కుంటే త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ జిల్లా క‌లెక్ట‌ర్ కు ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసిన మంత్రి అయ్య‌న్న వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎంత మ‌న‌సులో అసంతృప్తి ఉంటే మాత్రం.. అధిప‌త్య పోరు కోసం మ‌రీ ఇంత‌లా రోడ్డున ప‌డ‌తారా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోటి నుంచి వ‌స్తోంది.

గంటా.. అయ్య‌న్న‌ల మ‌ధ్య అధిప‌త్య‌పోరు ఈనాటిది కాదు. ఎవ‌రికి వారుగా త‌మ అధిప‌త్య‌మే జిల్లాలో న‌డ‌వాల‌ని త‌పిస్తుంటారు. ఇందులో భాగంగా ఇరువురి మ‌ధ్య ప‌లు పంచాయితీలు ఉన్నాయి. తాజాగా గంటా వ‌ర్గం తీరుపై మంత్రి అయ్య‌న్న‌పాత్రుడుఆగ్ర‌హానికి గురి కావ‌ట‌మే కాదు.. తాను చెప్పిన‌ట్లుగా 24 గంట‌ల్లో మార్చాల‌ని.. లేకుంటే తీవ్ర ప‌రిణామాన్ని చూడాల్సి వ‌స్తుందంటూ అల్టిమేటం జారీ చేశారు.

ప్ర‌తి జిల్లాలో డీఎల్ డీఏ క‌మిటీలు ఉంటాయి. ఇంత‌కీ ఈ క‌మిటీలు ఏమిటంటే.. ప‌శు గ‌ణాభివృద్ధి సంస్థ‌. ఇందులో క‌మిటీని అధికార‌ప‌క్ష నేత‌లు డిసైడ్ చేస్తుంటారు. మిగిలిన జిల్లాల సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. విశాఖ జిల్లాలో ఈ క‌మిటీ 2013లో నియ‌మించారు. అంటే.. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో జ‌రిపిన నియామ‌కాన్ని టీడీపీ స‌ర్కారు వ‌చ్చినా మార్చ‌లేదు. ఈ క‌మిటీ ఛైర్మ‌న్ గా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత రాఘ‌వేంద్ర‌రావు ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రో 15 మంది స‌భ్యులు ఉన్నారు. దీనికి ఛైర్మ‌న్ గా మంత్రి గంటా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత కొన్ని.. ప‌ద‌వీ కాలం పూర్తి అయిన వెంట‌నే మ‌రికొన్ని క‌మిటీలు ర‌ద్దు కాగా.. విశాఖ జిల్లా క‌మిటీ మాత్రం నేటికీ కొన‌సాగుతోంది. గత నెల‌లో ప‌ద‌వీ కాలం ముగిసినా.. వారు కొన‌సాగుతున్నారు. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు లేఖ రాశారు. అయితే.. ఈ విష‌యం తెలియ‌ని అధికారులు ఎన్నిక నిర్వ‌హించాలంటూ క‌లెక్ట‌ర్ కు లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి గ‌త నెల 27న డీఎల్ డీఏ క‌మిటీకి 16 మంది స‌భ్యుల్ని నియ‌మించారు. దీనికి ఛైర్మ‌న్ గా మంత్రి గంటా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గాడు వెంక‌ట‌ప్ప‌డును ఎంపిక చేశారు.

ఈ విష‌యం తెలిసిన మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చిన‌రాజ‌ప్ప ముందు పంచాయితీ పెట్టారు. క‌మిటీలో మార్పులు సాయంత్రానికి పూర్తి కాకుంటే.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ హెచ్చ‌రిక చేశారు. మంత్రులంటే త‌మాషాగా ఉందా? అంటూ మండిప‌డ్డారు. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న చిన‌రాజ‌ప్ప జిల్లా క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేయ‌టంతో త‌ర్వాత జ‌ర‌గాల్సిన ప‌రిణామాల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. క‌మిటీని ర‌ద్దు చేస్తూ క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో.. అయ్య‌న్న శాంతించారు. మ‌రి.. దీనికి కౌంట‌ర్ పార్ట్ గా గంటా రియాక్ష‌న్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.