Begin typing your search above and press return to search.

వైసీపీలో తిరుగుబాటు - మంత్రి వ్యతిరేకంగా భారీ సభ

By:  Tupaki Desk   |   10 May 2022 2:25 PM GMT
వైసీపీలో తిరుగుబాటు - మంత్రి వ్యతిరేకంగా భారీ సభ
X
మంత్రి ఆదిమూలపు సురేష్ పై పార్టీలోని కొందరు నేతలు మండిపోయారు. బుధవారం నుండి గడప గడపకు కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై చర్చించేందుకు పుల్లలచెరువులో భారీ సభ జరిగింది. ఈ సభలో మాట్లాడిన నేతలు కొందరు మంత్రి వ్యవహారశైలిపై మండిపోయారు. నియోజకవర్గంలోని నేతలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం. అందరినీ కలుపుకుని వెళ్ళాల్సిన మంత్రి ఆపని చేయకుండా గ్రూపులను ప్రోత్సహించటం ఏమిటంటు రెచ్చిపోయారు.

పార్టీకోసం కష్టపడి పనిచేసేవారిని, సమర్ధులను కాదని మంత్రి అసమర్ధులకు పెద్దపీఠ వేస్తున్నట్లు కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలం ఓసీ అయ్యుంటే ప్రజాబలం కలిగిన నేతలు ఎవరనే విషయం మంత్రికి బాగా తెలిసొచ్చేదన్నారు. ప్రజాబలం కలిగిన నేతలతో పెట్టుకుంటే ఏమవుతుందో మంత్రికి చూపిస్తామని శపథం చేశారు.

మూడేళ్ళుగా పార్టీలోనే ఎన్నో అవమనాలను ఎదుర్కొంటున్నామని, అర్హతలేని వాళ్ళను అందలాలు ఎక్కిస్తున్నా చూస్తు వూరుకున్నట్లు చెప్పారు. మంత్రి వైఖరి చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు. జరుగుతున్న పరిణామాలు మంత్రికి తెలిసి జరుగుతున్నాయా లేకపోతే తెలీకుండానే జరుగుతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నట్లు చెప్పారు. పరిస్ధితులను గుర్తించి మంత్రి ఇప్పటికైనా ప్రజాబలం ఉన్న వాళ్ళని చేరదీయకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయమన్నారు.

ప్రజల పక్షాన మనంలేనపుడు ఇక గడప గడపకు కార్యక్రమం పేరుతో ఏమొహం పెట్టుకుని వెళతామంటు నిలదీశారు. ఎవరు ఏమిటో తెలుసుకుని మంత్రి రాజకీయం చేయాలని హితవు చెప్పారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యమని, విలువలు లేకుండా రాజకీయాలు చేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. అనర్హులను అందలాలు ఎక్కించడమంటే పునాదులు లేకుండా భవనాన్ని నిర్మించటమన్న విషయాన్ని మంత్రి తెలుసుకోవాలని హెచ్చరించారు.