Begin typing your search above and press return to search.

సోనియా-మోడీ కారణంగా నష్టపోతున్న ఏపీ!

By:  Tupaki Desk   |   14 Dec 2021 11:00 PM IST
సోనియా-మోడీ కారణంగా నష్టపోతున్న ఏపీ!
X
చూస్తుంటే వ్యవహారం అలాగే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి అయినా ఇపుడు నరేంద్రమోడి అయినా ఒకే విధంగా ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకపోతే అప్పట్లో సోనియాది పాజిటివ్ ఆలోచన అయితే ఇపుడు మోడీది నెగిటివ్ ఆలోచనంతే. ఇంతకీ విషయం ఏమిటంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ముందు ఏమి ఆలోచించింది ? సమైక్యాంధ్రాను రెండు రాష్ట్రాలుగా విడగొడితే ఇటు తెలంగాణాలోను అటు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని సోనియా ఆలోచించారు.

అంటే రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేయచ్చనే ఆలోచన సోనియాకు లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోని క్షేత్రస్ధాయి పరిస్ధితులు సోనియాకు ఏమి తెలుస్తుంది. ప్రజల మనోభావాలను అర్ధం చేసుకునేంత సీన్ సోనియాకు లేదు. కాకపోతే ఆ స్ధాయిలో తెలంగాణా నేతలే తప్పుదోవ పట్టించారు. దాంతో వాళ్ళుచెప్పింది నిజమే అనుకుని సోనియా రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించేసింది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ దెబ్బతినేసింది.

తెలంగాణాలో ఏదో పర్వాలేదు కానీ ఏపీలో అయితే ఏకంగా భూస్ధాపితమే అయిపోయింది. విభజనతో కాంగ్రెస్ పార్టీకి శుభంకార్డు పడిపోయింది. ఇపుడు మోడీ విషయానికి వస్తే ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ అంశం నానుతోంది. నిజానికి ఈరెండు హామీలు విభజన చట్టంలోనివే. కానీ హామీలను మోడి దిగ్విజయంగా తుంగలో తొక్కేశారు. ఏపీ మీద ఏదో కసున్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఎందుకింతగా రాష్ట్రంపైన మోడీకి వ్యతిరేకత ?

ఎందుకంటే ఏపీ ప్రయోజనాలకు ఎంత పెద్దపీట వేసినా బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. గడచిన ఏడేళ్ళుగా ఏదో పద్దతిలో మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుంటే ఏపిలో మాత్రం పాతాళంలోకి జారిపోతోంది. సారధులను ఎంతమందిని మార్చినా, ఎన్ని జాకీలను ఉపయోగించినా పార్టీమాత్రం పైకి లేవటంలేదు. ఏపీ అంటేనే బహుశా మోడీకి ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉంటోందేమో. అందుకనే పార్టీ కోసమని ఏపీ ప్రయోజనాలను మోడీ దారణంగా దెబ్బకొడుతున్నారు.

ఇక్కడ క్లియర్ గా అర్ధమవుతున్నదేమంటే సోనియాదేమో ఏమీ తెలీని అజ్ఞానం. అందుకనే అత్యాసకుపోయి సమైక్య రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి దెబ్బతినేసింది. ఇక మోడీదేమో అన్నీ తెలిసినా సంకుచిత మనస్తత్వం. పార్టీపరంగా ఏమాత్రం ఉపయోగం లేని రాష్ట్రానికి ఎందుకు మేలు చేయాలనే కసి కనబడుతోంది. స్ధూలంగా చూస్తే అప్పట్లో సోనియా, ఇపుడు ఆలోచనతో నష్టపోతోంది మాత్రం ఏపీనే అన్నది స్పష్టం.