Begin typing your search above and press return to search.

ఏపీ మండ‌లిః వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి టు.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి!

By:  Tupaki Desk   |   27 Jan 2020 10:53 AM IST
ఏపీ మండ‌లిః వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి టు.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి!
X
2004 ఎన్నిక‌ల్లో ఏపీ లో బంప‌ర్ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌చ్చిన రాజ‌కీయ మార్పుల్లో.. శాస‌న‌మండ‌లి పున‌రుద్ధ‌ర‌ణ ఒక‌టి. అప్ప‌టికి రెండు ద‌శాబ్దాల క్రితం ఏపీ రాజ‌కీయం నుంచి మాయం అయిన శాస‌న‌మండ‌లిని అప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి పున‌రుద్ధ‌రించారు. దానికి త‌క్ష‌ణ కార‌ణం అంటూ ఏమీ లేదు. త‌మ పార్టీలో భారీ ఎత్తున ఉన్న రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించ‌డానికి అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే అప్ప‌ట్లో మండ‌లి పున‌రుద్ధ‌ర‌ణ ఆస‌క్తి దాయ‌కంగా నిలిచింది.

కొంద‌రు మేధావుల‌ను మండ‌లికి నామినేట్ చేసింది ప్ర‌భుత్వం. చుక్కా రామ‌య్య త‌దిత‌రుల‌ను అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ కోటా కింద నామినేట్ చేశారు. ఇక కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల నుంచి సీనియ‌ర్లు మండ‌లికి నామినేట్ అయ్యారు. అలా ఆ స‌భ ఒక రూపాన్ని సంత‌రించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వ‌చ్చిన మూడేళ్ల‌ కు అలా శాస‌న‌మండ‌లి ఏర్పాటు అయ్యింది.

ఆ త‌ర్వాత మిగ‌తా వాళ్ల‌ కు అది రాజ‌కీయంగా క‌లిసి వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో టికెట్లు ల‌భించ‌ని వాళ్ల‌కు, గెల‌వ‌క‌ పోయినా మంత్రి ప‌దవులు కావాల్సిన వారికి మండ‌లి క‌లిసి వ‌చ్చింది. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి మండ‌లి స‌భ్యులెవ‌రికీ మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేదు. అయితే ఆ త‌ర్వాత మాత్రం అది కొన‌సాగింది. కిర‌ణ్ కుమార్ రెడ్డి కొంద‌రు ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక చంద్ర‌బాబునాయుడు కేబినెట్లో అయితే ఎమ్మెల్సీలే మంత్రులుగా హ‌డావుడి చేశారు.

వైఎస్ హ‌యాంలో మండ‌లి ఏర్పాటును చంద్ర‌బాబు నాయుడు వ్య‌తిరేకించారు. అయితే చంద్ర‌బాబు నాయుడు త‌న త‌న‌యుడినే ఎమ్మెల్సీగా చేసుకుని మంత్రి ప‌ద‌వి ఇచ్చాడు! ఇక చంద్ర‌బాబు కేబినెట్లో య‌న‌మ‌ల , నారాయ‌ణ‌, సోమిరెడ్డి వంటి మండ‌లి మంత్రులు కొన‌సాగారు.

ఇప్పుడు మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్న జ‌గ‌న్ కేబినెట్లో కూడా ఇద్ద‌రు మండ‌లి మంత్రులున్నారు. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ ర‌మ‌ణ‌లు మండ‌లి స‌భ్య‌త్వం తో మంత్రులు గా సాగుతున్నారు. ఈ నేప‌థ్యం లో ఇప్పుడు వారు రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టే. అయితే ఇంకా కేంద్ర ఆమోదం ప‌డాలి కాబ‌ట్టి.. అంత వ‌ర‌కూ మండ‌లి కొన‌సాగుతుంద‌ని అంటున్నారు కాబ‌ట్టి... వీరు మంత్రులుగా కొన‌సాగ‌వ‌చ్చేమో.

ఏదేమైనా వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో ఏర్పాటు అయిన శాస‌న‌మండ‌లి ఇప్పుడు త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యాం లో ర‌ద్దు అవుతుండ‌టం గ‌మ‌నార్హం.