Begin typing your search above and press return to search.

అన్నదాత మృత్యుఘోష ..మూడులో ఏపీ..ఐదులో తెలంగాణ!

By:  Tupaki Desk   |   2 Sept 2020 11:00 AM IST
అన్నదాత మృత్యుఘోష ..మూడులో ఏపీ..ఐదులో తెలంగాణ!
X
దేశంలో వ్యవసాయ రంగం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నది. అగమ్యగోచరంలో అన్నదాత విలవిలలాడుతున్నాడు. ఏరు దాటాక...తెప్ప తగిలేసినట్టుగా పాలకులతీరు కనిపిస్తున్నది. ఎన్నికలప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక... పాలకులు నోరుమెదపటంలేదు. దేశంలో అన్నదాతల ఆత్మహత్యల పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019 లో దేశంలో మొత్తంగా 10, 281 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన ఆ వివరాల్లో టాప్ లో మహారాష్ట్ర నిలువగా .. తెలుగు రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణ వరుసగా మూడు , ఐదు స్థానాల్లో నిలిచాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన ఆ వివరాలని చూస్తే ..

ఆంధ్రప్రదేశ్ ‌లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 54.96% పెరిగాయి. 2018 సంవత్సరంలో 664 ఆత్మహత్యలు చోటుచేసుకోగా 2019లో ఆ సంఖ్య 1,029కు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఏపీ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఈసారి కేవలం కౌలు రైతుల ఆత్మహత్యలను పరిగణనలోకి తీసుకుంటే రెండో స్థానంలో ఉంది. జాతీయ నేర గణాంక సంస్థ మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2019 ఆందోళన కలిగించే వివరాలను వెల్లడించింది. . దేశవ్యాప్తంగా గతేడాది బలవన్మరణాలకు పాల్పడిన రైతులు, వ్యవసాయ కూలీల్లో 10.08% మంది ఏపీ వారే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. 2018తో పోలిస్తే 2019లో సొంత భూమిని సాగు చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు 120% , కౌలు రైతుల ఆత్మహత్యలు 14.45% పెరిగాయి. ఇక తెలంగాణ లో 2019 లో వివిధ కారణాలతో 7675 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

2019లో ఏపీలో 6,465 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో పురుషులు 4,740 మంది కాగా, మహిళలు 1,725 మంది.ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అత్యధిక శాతం మంది నిరక్షరాస్యులు, పదో తరగతి లోపు చదువుకున్న వారే.బలవన్మరణాలకు పాల్పడ్డ 6,465 మందిలో 4,291 మంది రూ.లక్ష లోపు ఆదాయం కలిగిన వారే. రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు 88 మందే ఉన్నారు.ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో వివాహితులే అధికంగా ఉంటున్నారు. గతేడాదిలో 383 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.