Begin typing your search above and press return to search.

ఆ పదాలేంటి? ప్రభుత్వాన్ని ఇలానే నడుపుతారా? ఏపీ హైకోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   25 Sept 2020 10:45 AM IST
ఆ పదాలేంటి? ప్రభుత్వాన్ని ఇలానే నడుపుతారా? ఏపీ హైకోర్టు ఆగ్రహం
X
ఏపీ సర్కారుకు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. గతానికి భిన్నంగా తాజా ఉదంతంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యల్ని చేసింది. ‘‘ఇది లౌకిక రాష్ట్రమేనా?’’ అన్న ప్రశ్నను సందించటమే కాదు.. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ముస్లిం యూత్ అని ఎలా ప్రస్తావిస్తారు? ఆ భాష ఏమిటి? ప్రభుత్వాన్ని నడిపేది ఇలానేనా? అంటూ తీవ్రంగా తప్పు పట్టింది. అంతేకాదు.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.

సంచలనంగా మారిన ఈ వ్యవహారం ఏమిటి? ఏపీ ప్రభుత్వం ఏం చేసింది? హైకోర్టు ఎందుకంత ఘాటుగా రియాక్టు అయ్యింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. 2018 మే 15న పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి.. పోలీసుల్ని గాయపర్చారు కొందరు యువకులు. దీనికి సంబంధించి ఆరుగురిపై కేసుల్ని నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో యువకులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకునేందుకు జీవో 776ను జారీ చేశారు.

దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పసుపులేటి గణేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు విచారణలో జీవోలో.. ముస్లిం యూత్ అని పేర్కొంటూ విడుదల చేసిన జీవో తప్పుడు ఉద్దేశాన్ని సూచిస్తుందని హైకోర్టు పేర్కొంది. అంతేకాదు.. ప్రభుత్వ జీవోను సస్పెన్షన్ విధించింది. సామాజిక వర్గాల్ని జీవోలో పేర్కొనటం రాజ్యాంగ పీఠికకు పూర్తిగా విరుద్దమని స్పష్టం చేసినకోర్టు.. రాజ్యాంగం ప్రకారం ఇది లౌకిక రాష్ట్రమేనా? అని ప్రశ్నించింది.

ప్రభుత్వం విడుదల చేసిన జీవోను చూస్తుంటే.. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ కోసం ఇచ్చినట్లుగా లేదని.. కేవలం రాజకీయ లబ్థి పొందేందుకే జారీ చేసినట్లు ఉందన్న ఘాటు వ్యాఖ్య చేసింది. ముస్లిం సామాజిక వర్గం మొత్తాన్ని ఎలా సాధారణీకరిస్తారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఓట్లు పొందేందుకు ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించటానికి అనుమతించేది లేదని పేర్కొంది.

ఈ ఏడాది ఆగస్టు 12న జారీ చేసిన ఈ జీవోను సస్పెండ్ చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ల విషయంలో స్టేటస్ కోను పాటించాలని కోరింది. ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. డీజీపీ.. గుంటూరు ఎస్పీ.. పాతగుంటూరు ఠాణా ఎస్ హెచ్ వోలకు నోటీసులు జారీ చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా జీవోలు తయారు చేసిన వారిని తప్పు పడుతున్నారు.