Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌ కు మరో ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   7 Sept 2020 6:20 PM IST
ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌ కు మరో ఎదురుదెబ్బ
X
ఏపీ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో చుక్కెదురైంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో కేంద్ర హోంశాఖకు వ్రాసిన లేఖకు సంబంధించి సీఐడి నిర్వహిస్తున్న విచారణ పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, ఈ విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారనే వివరాలు సమర్పించాలని కోరింది. ఎన్నికల సంఘం ఉద్యోగుల్ని విధులు నిర్వహించకుండా.. సీఐడీ కేసులు పెట్టిందని ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ క్వాస్ పిటిషన్ వేయగా నేడు ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే ఇచ్చింది.

రమేష్ ‌కుమార్‌ రాసిన లేఖ వాస్తవానికి ఆయన రాయలేదని, వేరేవారు తయారు చేసిన లేఖను ఆయన పంపారని వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉద్యోగులను సీఐడీ అధికారులు విచారించారు. కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ క్వాస్ పిటిషన్ వేశాడు. తమ సిబ్బందిపై సీఐడీ నమోదు చేసిన కేసు రాజ్యాంగ విరుద్ధమని, ఈ వ్యవహారంపై సీబీఐ తో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సీఐడీ అధికారులు ఎస్‌ ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్‌ ను, అందులోని డేటాను తీసుకెళ్లారని, వారు స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ లో పొందుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే , ఈ కేసు పై తదుపరి విచారణకు సోమవారానికి వాయిదా వేసింది.