Begin typing your search above and press return to search.

ఇక కరణం వంతు..హైకోర్టు తాఖీదులు వచ్చేశాయి

By:  Tupaki Desk   |   14 Sep 2019 3:57 PM GMT
ఇక కరణం వంతు..హైకోర్టు తాఖీదులు వచ్చేశాయి
X
గడచిన ఎన్నికల్లో ఘోరాతిఘోరంగా ఓటమిపాలైన టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. టీడీపీ హయాంలో స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ వివాదం, ఆ తర్వాత కోడెల జిల్లాకే చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వివాదంతో ఇప్పటికే టీడీపీ వాయిస్ పూర్తిగా సైలెంట్ అయిపోగా... తాజాగా పార్టీలో తొలి తరం నేతగా పేరున్న సీనియర్ నేత - చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపైనా వివాదం కలకలం రేపుతోంది. ఏకంగా కరణంపై అనర్హత పడే అవకాశాలున్నాయన్నట్లుగా వినిపిస్తున్న ఈ వివాదం టీడీపీకి మరో తలనొప్పిగానే పరిణమించిందని చెప్పక తప్పదు.

అసలు విషయంలోకి వెళితే... అప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కరణంను గడచిన ఎన్నికల్లో చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ బరిలోకి దించింది. టీడీపీ ఆశయం అయితే నెవరేరి కరణం గెలిచి.. ఆమంచి ఓటమిపాలయ్యారు గానీ... అసలు చిక్కంతా కరణం సమర్పించిన అఫిడవిట్ తోనే వచ్చిందట. కరణం బలరాంకు ఇద్దరు భార్యలున్నారన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే తన అఫిడవిట్ లో కరణం తనకు ఒకే ఒక్క భార్య ఉన్నట్లుగా పేర్కొంటూ.. రెండో భార్య - ఆమె ద్వారా కలిగిన కూతురు వివరాలను కరణం దాచేశారు.

ఇదే పాయింట్ ను పట్టుకున్న ఆమంచి... కరణం ఎన్నికను రద్దు చేయాలని - ఆయనపై అనర్హత వేటు వేయాలని ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. కరణం తన అఫిడవిట్ లో పేర్కొన్న తొలి భార్య పేరుతో పాటు ఆయన రెండో సతీమణి పేరును కూడా ప్రస్తావిస్తూ ఆమంచి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... శనివారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి.. కరణం బలరాంతో పాటు అప్పటి చీరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీచేశారు. ఈ కేసులో 3 వారాల్లోగా స్పందనను తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. ఈ పరిణామంతో నిజంగానే కరణం మెడపై అనర్హత కత్తి వేలాడుతున్నట్లుగానే విశ్లేషణలు సాగుతున్నాయి.