Begin typing your search above and press return to search.

పట్టాభి అరెస్టుపై కీలక వ్యాఖ్య చేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   23 Oct 2021 6:30 AM GMT
పట్టాభి అరెస్టుపై కీలక వ్యాఖ్య చేసిన హైకోర్టు
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మురెడ్డి పట్టాభిరామ్ చేసిన అనుచిత వ్యాఖ్య.. అనంతరం ఆయన ఇంటిపైనా.. పార్టీ ప్రధాన కార్యాలయం మీదా దాడి జరగటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను రాజమహేంద్రపురంలోని జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. పట్టాభి అరెస్టు అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

శుక్రవారం హైకోర్టు ప్రారంభం కాగానే పట్టాభిరామ్ తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరారు. పోలీసుల నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. సీఆర్పీసీ 41ఏ ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి.. వివరణ తీసుకోవాలని.. 41ఏ నోటీసులో ఖాళీలపై మెజిస్ట్రేట్ అభ్యంతరం తెలిపారన్నారు. వారంలో వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారని చెప్పారు.

దీనికి స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ కె. లలిత.. రిమాండ్ లోని అంశాలు సంత్రప్తి చెందకుంటే మెజిస్ట్రేట్ రిమాండ్ కు ఎలా అనుమతిస్తారు? అని పీపీని ప్రశ్నించారు. అయితే.. ఈ వాదనకు సంబంధించిన రికార్డులన్ని కింది కోర్టులో ఉన్నాయని.. తనకు సమయం ఇస్తే వివరాలు సమర్పిస్తామన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి కేసును ఈ రోజు (శనివారానికి) కు వాయిదా వేశారు.

పట్టాభి తరఫు న్యాయవాది పేర్కొన్నట్లుగా నోటీసులో ఖాళీ ఉన్న పక్షంలో.. రిమాండ్ ఆదేశాలకు భిన్నమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. పట్టాభి తరఫు లాయర్ పేర్కొన్నట్లుగా రికార్డులు ఉంటే పరిస్థితి మరోలా ఉంటుందని.. కింది కోర్టు ఆదేశాల్ని డిస్మిస్ చేసినా ఆశ్చర్యం లేదన్న మాట న్యాయవాద వర్గాల నోట వినిపిస్తోంది. అయితే.. ఈ రోజు (శనివారం) పీపీ కోర్టుకు తెలిపే అంశాల ఆధారంగా తుది నిర్ణయం వెలువడే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.