Begin typing your search above and press return to search.

బిల్లుల చెల్లింపులకు హైకోర్టు నుంచి చెప్పించుకోవాల్సి వచ్చిందే

By:  Tupaki Desk   |   24 Aug 2021 10:44 AM GMT
బిల్లుల చెల్లింపులకు హైకోర్టు నుంచి చెప్పించుకోవాల్సి వచ్చిందే
X
ఇటీవల కాలంలో కోర్టుల నుంచి అదే పనిగా ఎదురుదెబ్బలు తింటున్న జగన్ సర్కారు.. తాజాగా మరోసారి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. జగన్ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవటంపై సీరియస్ అయ్యింది. రెండు వారాల్లో పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలంటూ మధ్యంతర ఆదేశాల్ని జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోవటం పిటిషనర్లు జీవించే హక్కును హరించటమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించటం గమనార్హం.

కోర్టును ఆశ్రయించిన 500 మంది పిటిషనర్లకు రెండు వారాల్లో డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో చెల్లించాల్సిన డబ్బుకు వడ్డీ.. 20 శాతం మినహాయింపు విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. నరేగా పనులు చేసినప్పటికి వాటికి చెల్లింపుల విషయం ఇప్పటికి పెండింగ్ లో ఉంది. కేంద్రం తాము చెల్లించాల్సిన మొత్తాల్ని చెల్లించినట్లుగా పేర్కొంది. తమ వద్ద ఎలాంటి బకాయిలు లేవని పేర్కొంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డబ్బులు రాలేవని చెప్పింది.

దీంతో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర విరుద్ధ అంశాలు రావటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో బిల్లులు చెల్లిస్తామని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన హైకోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ను ప్రస్తావించింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించటమని వ్యాఖ్యానించింది. చేసిన పనులకు బిల్లుల్ని చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.