Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది

By:  Tupaki Desk   |   12 Dec 2016 10:29 AM GMT
ఏపీలో ఆ స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది
X
ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల పోరు కోసం వేచి చూస్తున్న వారికి మ‌రికొంత కాలం నిరీక్ష‌ణ త‌ప్పేలా లేదు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే సుమారు రెండున్న‌ర‌ సంవ‌త్స‌రాల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న‌ కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత 7 కార్పొరేషన్లు, 4 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని అంతా భావించారు. ఆ ప్రకారంగా విశాఖ, గుంటూరు, శ్రీకాకుళం, కర్నూ లు, తిరుపతి, కాకినాడ, ఒంగోలు కార్పొరేషన్లు, రాజంపేట, రాజాం, కందుకూరు, నెల్లిమర్ల మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ అంచ‌నాల‌పై పుర‌పాల‌క, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయ‌ణ నీల్లు చ‌ల్లారు.

నారాయణ తాజాగామీడియాతో మాట్లాడుతూ...కోర్టు వివాదాలు ముగిసిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి, కాకినాడ, రాజం, గుంటూరు పుర‌పాలిక‌ల‌కు సంబంధించి కోర్టు కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఒంగోలు, రాజంపేట, కందుకూరుల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయని నారాయ‌ణ అన్నారు. ఆ ప్రాంతాల ఎన్నికల నిర్వహణకు సమస్యలున్నాయని వివరిం చారు. కోర్టు కేసులు పూర్త‌యిన చోట తొలుత జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్ల సంఖ్య పెంచాల్సి ఉందని, ఆ పని పూర్తికాగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

ఇదిలాఉండ‌గా ప్ర‌భుత్వం ఉద్దేశపూర్వ‌కంగానే ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తోందిని విప‌క్షాలు అంటున్నాయి. ఆ పార్టీల వాద‌న ప్ర‌కారం ఇటీవ‌ల క్రితం అధికార టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టత ఇచ్చిన మేర‌కు స్థానిక సంస్థలకు సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. బహుశా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్ర‌త్యేక హోదా సాధించ‌డంలో వైఫ‌ల్యం చెండం, పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవ‌డం అసాధ్య‌మ‌ని భావించ‌డం వ‌ల్లే ఇలా ఎన్నిక‌లు వాయిదా వేస్తున్నార‌ని విప‌క్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.