Begin typing your search above and press return to search.

జగన్ సంచలనం...యరపతినేనిపై సీబీఐ దర్యాప్తు

By:  Tupaki Desk   |   4 Sept 2019 4:53 PM IST
జగన్ సంచలనం...యరపతినేనిపై సీబీఐ దర్యాప్తు
X
టీడీపీ సీనియర్ నేత - గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌ కేసుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యరపతినేని అక్రమంగా సాగించిన మైనింగ్‌ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.యరపతినేనిపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి అని - అందుకే అక్రమ మైనింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలియజేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఇప్పటిదాకా ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీసీఐడీ తెలిసిన నేపథ్యంలో సీబీఐతో పాటు త్వరలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం కోనంకి - దాచేపల్లి మండలం నడికుడి - కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యేగా తన పరపతిని వినియోగించి యరపతినేని అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్‌ టన్నుల లైమ్‌ స్టోన్‌ ని దోచేశారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌ పై గతేడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణ చేపట్టింది.ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌ పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్‌ కవర్‌ లో గత సోమవారం సీబీసీఐడీ అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్‌ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందని సదరు నివేదికలో అధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కోర్టు వ్యాఖ్యలపై నిన్నటిదాకా జగన్ సర్కారు స్పందించకున్నా... తాజాగా బుధవారం ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తు బదలాయించడంతో మైనింగ్‌ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు యరపతినేని - ఆయన బినామీలు అక్రమ మైనింగ్‌ కారణంగా వేల కోట్ల నూపాయల మేర గడించినట్టు గుర్తించారు. మైనింగ్‌ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి - ఘట్టమనేని నాగేశ్వరరావు - ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ జగమెరిగినవే.గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్‌ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్‌ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్‌ కేసుబదలాయించడంతో యరపతినేని - ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఒక్క అక్రమ మైనింగే కాకుండా మనీ ల్యాండరింగ్ కూడా ఉందన్న కోణంలో సీబీసీఐడీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో యరపతినేనిపై త్వరలోనే ఈడీ కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.