Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి తొలిసారి గవర్నర్....?

By:  Tupaki Desk   |   6 March 2022 11:30 PM GMT
అసెంబ్లీకి తొలిసారి గవర్నర్....?
X
అసెంబ్లీకి గవర్నర్ కి ఒక చక్కని సంబంధం ఉంది. ప్రతీ ఏటా సర్కార్ ప్రవేశపెట్టే బడ్జెట్ వేళ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేయడం ఒక చక్కని ఆనవాయితీ. తన ప్రభుత్వం అంటూ ఆయన బడ్జెట్ తో పాటు సర్కార్ విజయాలు కూడా చెబుతారు. గవర్నర్ ప్రసంగం తరువాత ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. దాని మీద చర్చ కొన్ని రోజుల పాటు జరుగుతుంది. ఇలా ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతోంది అని రాష్ట్ర ప్రధమ పౌరుడు తన నోట అసెంబ్లీ వేదికగా కోట్లాది జనాలకు చెబుతారు.

అలా అసెంబ్లీకి తన పదవీ కాలంలో అయిదు సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏపీకి గవర్నర్ గా రెండున్నరేళ్ళుగా పనిచేస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్ అయితే ఇప్పటిదాకా శాసనసభకు అసలు రాలేదు. దానికి కారణం 2020, 2021 బడ్జెట్ సమావేశాలను కరోనా మింగేసింది. దాంతో పరిమితంగా అసెంబ్లీ సమావేశమైతే గవర్నర్ వర్చువల్ గానే ప్రసంగం చేస్తూ వచ్చారు.

ఈసారి బడ్జెట్ కి మాత్రం ఎలాంటి కరోనా భయాలు లేకపోవడంతో నేరుగా అసెంబ్లీకి ఆయన వస్తున్నారు. దాంతో గవర్నర్ రాక సందర్భంగా అసెంబ్లీ అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గవర్నర్ రాక వేళ కట్టుదిట్టమైన భద్రత కోసం ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.

గవర్నర్ ఏ గేటు నుంచి శాసనసభకు చేరుకోవాలి. ఆయన కాన్వాయ్ ఏ మార్గాన వస్తుంది అన్న దాని నుంచి ప్రతీ దాని మీద కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు అసెంబ్లీకి ఫస్ట్ టైమ్ వస్తున్న గవర్నర్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ మోషేన్ రాజు ఘన స్వాగతం పలుకుతారు. ఏది ఏమైనా గవర్నర్ రాక కోసం అసెంబ్లీ తగిన ఏర్పాట్లు చేస్తూంటే సుదీర్ఘ కాలం తరువాత బడ్జెట్ కళతో అసెంబ్లీ రెడీ అవుతోంది.