Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వ విప్ ను పోలీసులు అడ్డుకున్నారు.. తర్వాతేం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   12 July 2021 3:36 AM GMT
ఏపీ ప్రభుత్వ విప్ ను పోలీసులు అడ్డుకున్నారు.. తర్వాతేం జరిగిందంటే?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసా..గుతూనే ఉంది. ఏపీ ప్రయోజనాల్ని తెలంగాణ ప్రభుత్వం కాల రాస్తుందన్న వాదనను ఏపీ నేతలు చేస్తుంటే.. అందుకు భిన్నమైన ఆరోపణల్ని చేస్తున్నారు తెలంగాణ అధికారపక్ష నేతలు. ఇరువురి ప్రాంతాల్లోని ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించిన వైనం ఈ వ్యవహారాన్ని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. ఇదిలా ఉంటే..తాజాగా చోటు చేసుకున్న పరిణామం.. అందుకు స్పందించిన వైసీపీ నేత తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీ పరిధిలోని పులిచింతలకు వెళ్లాలంటే ఏపీలో నుంచి తెలంగాణ సరిహద్దుల్లోకి అక్కడ నుంచి ఏపీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. తెలంగాణ పోలీసులు అనుమతి లేదని పేర్కొనటంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు.

ముక్త్యాలలోని కృష్ణానది వద్దకు చేరుకుని నాటు పడవల ద్వారా గుంటూరు జిల్లా మాదిపాడులోని అవతలి ఒడ్డుకు చేరుకుని రైతులు, విలేకరులతో కలిసి పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నంత మాత్రాన ఆగకుండా.. ప్రాజెక్టు పరిశీలనకు ఆయన స్పందించిన తీరు పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కుతోందన్నారు.

సరిగ్గా వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న వేళలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జల విద్యుదుత్పత్తికి పూనుకోవటంతో నీరు అందక సాగు సాగని పరిస్థితి నెలకొందన్నారు. పులిచింతలతో పాటు శ్రీశైలం.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద తెలంగాణ సర్కార్ అక్రమ విద్యుదుత్పత్తికి పాల్పొడుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. గడిచిన పది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమా అని ఏడున్నర టీఎంసీల నీరు పులిచింతల ప్రాజెక్టు ద్వారా వృధాగా సముద్రంలోకి కలిపారన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకోవాలని.. లేదంటే కేంద్రం దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు.

తెలంగాణ కారణంగా ఏడున్నర టీఎంసీల నీరు వేస్ట్ అయ్యిందన్న ఉదయభాను.. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాల మాగాణి.. 20వేల ఎకరాల మెట్టపంటలకు సరిపోతాయని చెప్పారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదన్నారు. పులిచింతల ప్రాజెక్టు గురించి మాట్లాడిన ఉదయభాను.. ఈ ప్రాజెక్టును 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మాణాన్ని షురూ చేశారని.. ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగని పక్షంలో తెలంగాణ వాటా కింద 120 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు వచ్చేదా? అని సూటిగా ప్రశ్నించారు.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకంలో ఎక్కువగా లబ్థి పొందింది తెలంగాణ రైతులేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అక్రమంగా నీటిని వదిలే కార్యక్రమాన్ని విరమించుకోవాలన్నారు. మొత్తంగా ఏపీ ప్రయోజనాల మీదా.. తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఉదయ భాను కళ్లకు కట్టినట్లుగా చెప్పారన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రియాక్షన్ ఏ తీరులో ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారినట్లుగా చెప్పక తప్పదు. ఉదయభాను చెప్పిన లెక్కల వాదనకు.. తెలంగాణ తరఫున ఎవరు వకల్తా పుచ్చుకొని వాదనలు వినిపిస్తారో చూడాలి.