Begin typing your search above and press return to search.

కోన‌సీమ జిల్లాకు పేరు మార్పు.. ముగిసిన అభ్యంత‌రాల గ‌డువు.. ప్రభుత్వం ఏం చేయ‌నుంది?

By:  Tupaki Desk   |   20 Jun 2022 7:33 AM GMT
కోన‌సీమ జిల్లాకు పేరు మార్పు.. ముగిసిన అభ్యంత‌రాల గ‌డువు.. ప్రభుత్వం ఏం చేయ‌నుంది?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోన‌సీమ జిల్లాకు డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ పేరును పెడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీన్ని వ్య‌తిరేకిస్తూ కోన‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మే 24న‌ చేప‌ట్టిన ఆందోళ‌న కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో తీవ్ర విధ్వంసానికి, అల్ల‌ర్ల‌కు దారితీసింది. నిర‌స‌న‌కారులు ప‌లు ప్రైవేటు, ఆర్టీసీ బ‌స్సుల‌ను ద‌హ‌నం చేశారు.

అంత‌టితో ఆగ‌కుండా ర‌వాణా శాఖ మంత్రి పినిపె విశ్వ‌రూప్, ముమ్మిడివ‌రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ కుమార్ ఇళ్ల‌ను ద‌హ‌నం చేశారు. ఈ కేసుల్లో ఇప్ప‌టికే ప్ర‌భుత్వం 176 మందిని అరెస్టు చేసింది. మ‌రికొంత‌మంది నిందితుల‌ను అరెస్టు చేయ‌డానికి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసింది.

మే 24న జ‌రిగిన అల్ల‌ర్లు, విధ్వంసం సంద‌ర్భంగా పెట్టిన 144 సెక్షన్, 30 సెక్ష‌న్ ఇంకా కొన‌సాగుతున్నాయి. రెండు వారాల‌కు పైగా ఇంట‌ర్నెట్ పై నిషేధం విధించారు. మ‌రోవైపు మే 18 నుంచి జూన్ 18 వ‌ర‌కు కోన‌సీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం విధించిన గ‌డువు పూర్తి అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుంద‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

మే 18 నుంచి జూన్ 18 వ‌ర‌కు జిల్లా పేరు మార్పు అంశంపై ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు, సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించింది. కోన‌సీమ జిల్లాలోని 22 మండ‌లాల్లో ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు స్వీక‌రించారు. దాదాపు ఆరు వేల మంది అభిప్రాయాల‌ను జిల్లా అధికారులకు పంపిన‌ట్టు సమాచారం. అందులో ప్ర‌జ‌లు వివిధ అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ క్రోడీకరించి.. ప్రజాభిప్రాయం ఎలా ఉందో స్పష్టతకు రానున్నారు. ఈ క్రోడీకరణ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేస్తార‌ని చెబుతున్నారు. ఆ త‌ర్వాత ఈ నివేదికను రాష్ట్ర‌ ప్రభుత్వానికి పంపుతారు.

జూన్ 22న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కోన‌సీమ జిల్లా పేరు మార్పు అంశాన్ని చ‌ర్చించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం జిల్లా అధికారుల నివేదిక ఆధారంగా..మెజార్టీ అభిప్రాయం మేరకు పేరును ప్రకటిస్తుందా..లేక, ఎటువంటి వివాదం లేకుండా ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తుందా అనేది ఈ సమావేశంలో తేలే అవకాశం కనిపిస్తోంది.

అయితే.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన అభిప్రాయాలు ఏవైనా ప్ర‌భుత్వం మాత్రం కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరును కొన‌సాగించే ఉద్దేశంతోనే ఉంద‌ని తెలుస్తోంది. అల్ల‌ర్లు, విధ్వంసం చోటు చేసుకున్ననాటి నుంచే ప్ర‌భుత్వం, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, మంత్రులు కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరే కొన‌సాగుతుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరు కొన‌సాగిస్తుంద‌ని తెలుస్తోంది.