Begin typing your search above and press return to search.

ఒకసారి తీస్తే.. తిరిగి తీసుకురావటం చాలా కష్టం సుమి

By:  Tupaki Desk   |   25 Jan 2020 12:30 PM IST
ఒకసారి తీస్తే.. తిరిగి తీసుకురావటం చాలా కష్టం సుమి
X
ఒక రాష్ట్రంలో శాసనమండలిని తీసేయటం ఎంత ఇబ్బందో.. ఒకసారి తీసేసిన తర్వాత తీసుకురావటం అంతకు రెట్టింపు ఇబ్బంది. ఒకవిధంగా చెప్పాలంటే.. మండలి తీయటం కాస్త ఈజీనేమో కానీ.. పునరుద్ధరించాలంటే కేంద్రంలో భారీ పలుకుబడితో పాటు.. విన్నపాన్ని మన్నించి ఆ దిశగా పావులు కదపటం అంత తేలికైన విషయం కాదు. ఎన్టీఆర్ పట్టుబడి తీసేసిన మండలిని పునరుద్ధరించేందుకు దివంగత మహానేత వైఎస్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. చివరకు మండలిని పునరుద్ధరిస్తే.. మీకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తానంటూ సీనియర్ కాంగ్రెస్ నేత కంతేటి సత్యనారాయణ రాజుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు వైఎస్.

నాటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ తో కంతేటికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. మండలిని పునరుద్ధరించేందుకు ఆయన విపరీతంగా శ్రమించారు. ఒక దశలో హైదరాబాద్ టు ఢిల్లీ షటిల్ సర్వీసులు చేశారు. పెద్ద ఎత్తున లాబీయింగ్ తో పాటు.. మండలి పునరుద్ధరణ కోసం కంతేటి చేసిన ప్రయత్నాల కారణంగా ఆయనకు మండలి రాజుగా పేరు కూడా పెట్టేశాయి రాజకీయ వర్గాలు.

మండలి తలుపులు ఒకసారి మూసిన తర్వాత.. తిరిగి తీసుకు రావాలంటే దానికి బోలెడంత ప్రాసెస్ తో పాటు.. కేంద్రంలోని పలు పార్టీలతో సత్ సంబంధాలు.. రాష్ట్రానికి మద్దతుగా ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రంలో స్థిర ప్రభుత్వం తో పాటు.. విపక్షాలు కూడా మండలిని పునరుద్ధరించేందుకు సానుకూలంగా స్పందించే వాతావరణం ఉండాలి. ఈ నేపథ్యంలో మండలిని మూయటం కష్టమైతే.. తిరిగి తెరవటం అందుకు రెట్టింపు కష్టమన్నది మర్చిపోకూడదు.