Begin typing your search above and press return to search.

దసరా ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ... !

By:  Tupaki Desk   |   5 Oct 2021 10:30 AM GMT
దసరా ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ... !
X
దసరా ఉత్సవాలపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శరన్నవరాత్రుల ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటన జారీ చేశారు. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని వెల్లడించారు. భక్తులు కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఇంద్రకీలాద్రీ పై జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.

ప్రతిపక్షాలు అనుమతి ఇవ్వాలని గట్టిగానే పోరాడాయి. చివరకి హైకోర్టు జోక్యం పరిమిత సంఖ్యలో భక్తులు, ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటుచేసుకోవచ్చని తెలిపింది. దుష్టసంహారంతో ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం అని చెబుతారు పండితులు. ఏటా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ నెల 7 నుంచి 15వ దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరో రెండు రోజుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి వచ్చే భక్తులందరూ కరోనా వైరస్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. భక్తులకు ఇబ్బంది రాకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. భక్తుల కోసం అత్యవసర వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కొండచరియలు జారకుండా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

ఏ రోజు ఏ అలంకారం

అక్టోబరు 7 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.
అక్టోబరు 8 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.
అక్టోబరు 9 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.
అక్టోబరు 10 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.
అక్టోబరు 11 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.
అక్టోబరు 12 శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).
అక్టోబరు 13 శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).
అక్టోబరు 14 శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).
అక్టోబరు 15 శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).

అక్టోబరు 11 సోమవారం శుద్ధ పంచమి, షష్ఠి తిధులు రావడంతో అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆలయ దర్శనవేళలు, టికెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కొరకు దేవస్థానం వెబ్ సైట్లో సందర్శించవచ్చని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు తెలిపారు.