Begin typing your search above and press return to search.

ఏపీ స్కూళ్లలో ఇక ఇంగ్లీష్ మీడియం.. నెరవేరిన జగన్ కల

By:  Tupaki Desk   |   14 May 2020 4:00 PM GMT
ఏపీ స్కూళ్లలో ఇక ఇంగ్లీష్ మీడియం.. నెరవేరిన జగన్ కల
X
రాబోయే 2020-21 విద్యా సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెడుతున్నట్టు వైఎస్ జగన్ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 24ను జారీ చేసింది.

హైకోర్టు సూచన మేరకు జగన్ సర్కార్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏ మాధ్యమంలో చదవాలనుకుంటున్నారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ బాధ్యతను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్.సీ.ఈ.ఆర్.టీ)కి అప్పగించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు మూడు ఆప్షన్లు ఇచ్చి.. వారి నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలను సేకరించారు.

ఈ సర్వేలో ‘‘1. ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు... 2. తెలుగు మీడియం.... 3. ఇతర భాషా మీడియం...’’ అనే మూడు ఆప్షన్లను విద్యార్థుల తల్లిదండ్రుల ముందు పెట్టారు. వాటిపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్‌చేసి, సంతకాలు చేశారు. మొత్తంగా 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలని మొదటి ఆప్షన్ ద్వారా స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తల్లిదండ్రులు తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు.

ఇక తెలుగు మీడియంలోనే బోధన కావాలని కోరుకున్న తల్లిదండ్రులు కేవలం 3.05శాతం మాత్రమే. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఏప్రిల్‌ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని సూచించారు.

ఈ మేరకు ఈ నివేదికను సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవుడ్ పిటీషన్ దాఖలు చేసింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.