Begin typing your search above and press return to search.

పోలవరం...రైల్వే జోన్... రెండూ అడగొద్దు

By:  Tupaki Desk   |   22 Dec 2022 6:35 AM GMT
పోలవరం...రైల్వే జోన్...  రెండూ అడగొద్దు
X
ఏపీకి పోలవరం ఒక వరం. అభివృద్ధికి సంకేతం. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ఎపుడు పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. తాజాగా పార్లమెంట్ లో కేంద్రం చేసిన ప్రకటనను బట్టి చూస్తే 2024 లో అయినా పూర్తి అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇరిగేషన్ కంపోనెంట్ కి మాత్రమే కేంద్రం నిధులు ఇవ్వాలని చూస్తోంది.

మరి పునరాస ప్యాకేజి అతి పెద్ద మొత్తంలో ఉంది. దాదాపుగా ముప్పయి వేల కోట్ల పైబడి ఆ ఒక్క దానికే చెల్లించాలి. మరి ఆ మొత్తం భరాయించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని పలు సందర్భాలలో తెలుస్తూనే ఉంది. సో పోలవరం ప్రాజెక్ట్ అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

ఇపుడు ఆ జాబితాలో మరోటి వచ్చి చేరింది. ఇది కూడా విభజన హామీల్లో ఉన్నదే. విశాఖకు రైల్వే జోన్ అన్నది ఉత్తరాంధ్రా వాసుల కల. అది యాభై ఏళ్ళ కల. అలాంటి విశాఖ రైల్వే జోన్ ఇస్తున్నామంటూ ఇప్పటికి నాలుగేళ్ళ క్రితం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మరి ఈ రోజుకు విశాఖ రైల్వే జోన్ ఎక్కడ ఉంది అంటే అక్కడే ఉంది.

లేటెస్ట్ గా చూస్తే విశాఖ రైల్వే జోన్ అన్నది అలా కొనసాగిస్తామని, అది సాగుతూనే ఉంటుందని, దానికి డెడ్ లైన్ అంటూ వేరేగా ఏదీ పెట్టుకోలేదని అది నిరంతర ప్రక్రియ అని రైల్వే బోడు అధికారులు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. రైల్వే జోన్ కి 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది.

ఈ మొత్తంలో 106 కోట్ల రూపాయలు కేటాయించి రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే వర్తమాన ఆర్ధిక సంవత్సరం అంటే 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం ఆరు లక్షలు ఖర్చు చేశామని వివరిస్తున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే రైల్వే జోన్ ఎప్పటికి పూర్తి అవుతుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు. విశాఖలో రైల్వే జోన్ పేరు చెప్పి లాభాల బాటలో ఉన్న వాల్తేర్ డివిజన్ ని లేకుండా చేశారు.

కొత్తగా రాయగడ డివిజన్ ని ఏర్పాటు చేసి ఒడిషా వారికి మేలు కలిగేలా చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా విశాఖ రైల్వే జోన్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతూ ఉంది. విశాఖ రైల్వే జోన్ ఎపుడు నిర్మాణం అవుతుంది. దాని కార్యకలాపాలు ఎపుడు మొదలవుతాయి అన్నది మాత్రం ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకోలేదని అంటున్నారు. అంటే అయినపుడు అవుతుంది అన్న మాట. అంతవరకూ ఏం చేయాలీ అంటే ఎదురు చూడాలి.

ఇక్కడ ఒక తమాషా ఉంది. అదేంటి అంటే విశాఖ రైల్వే జోన్ లేదా అంటే అనడానికి ఉంది. ఇచ్చారు. కానీ అది అందుబాటులోకి వస్తుందా అంటే మాత్రం అడగకూడదు అని అంటున్నారు. ఈ విధంగా అయితే ఇప్పటికి ఎన్నో ఎన్నికలకు చూసిన విశాఖ రైల్వే జోన్ సులువుగా మరో రెండో మూడో ఎన్నికలు చూసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. సో రైల్వే జోన్ ఎపుడు పూర్తి అవుతుంది అంటే జవాబు మాత్రం ఎవరికీ తెలియదంతే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.