Begin typing your search above and press return to search.

మోడీ ప్రోత్సాహం..జ‌గ‌న్ ఉత్సాహం..వందే విద్యుత్ మీట‌ర్!

By:  Tupaki Desk   |   13 May 2022 6:57 AM GMT
మోడీ ప్రోత్సాహం..జ‌గ‌న్ ఉత్సాహం..వందే విద్యుత్ మీట‌ర్!
X
ఆంధ్రావ‌ని వాకిట వ్య‌వ‌సాయ మోటార్లకు విద్యుత్ మీట‌ర్లు పెట్టే విష‌య‌మై ఇప్ప‌టికే వివాదం రేగుతోంది. ఇదే వివాదంపై తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కుల‌కు కూడా అసంతృప్తి ఉంది. వాళ్లంతా ఇదే విధాన ప‌ర నిర్ణ‌యాన్ని సంబంధిత వివాదాన్ని ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావిస్తూ కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నారు. కేవ‌లం ఐదు వేల కోట్ల రూపాయ‌లు ఆశించి ఈ ప‌థ‌కానికి జ‌గ‌న్ ఒప్పుకున్నార‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు వివిధ సంద‌ర్భాల్లో చెబుతున్న వైనం ఒక‌టి వీడియోల రూపంలో వెలుగు చూసింది. వీటిని తెలుగుదేశం పార్టీ వైర‌ల్ చేస్తోంది కూడా ! ఇదే విష‌య‌మై కేసీఆర్ తో పాటు హ‌రీశ్ రావు కూడా బ‌లీయంగా గొంతుక‌లు వినిపిస్తున్నారు. నిర‌స‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

వాస్త‌వానికి నాటి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ఆశ‌యం వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ అందించండం. నాణ్య‌మైన, కోత‌లు లేని విధంగా విద్యుత్ ను రోజుకు 7-9 గంట‌ల పాటు నిరంత‌రాయంగా అందించాల‌న్న‌ది ఆ నాటి మ‌హానేత మ‌హా సంక‌ల్పం.ముఖ్యంగా ఆంధ్రా క‌న్నా తెలంగాణ‌లో ఎక్కువ‌గా వ్య‌వ‌సాయం బోర్ల ఆధారితంగా సాగుతుంది. ఇక్క‌డ మాత్రం పంట కాలువ ఆధారితంగా సాగుతుంది. జ‌ల వ‌న‌రులు ఏ విధంగా చూసుకున్నా ఆంధ్రాలో ఎక్కువ. క‌నుక 3 పంట‌లు పండే నేల‌లూ ఎక్కువే !

ఈ నేప‌థ్యంలో వ్య‌వసాయ మీట‌ర్ల ఏర్పాటు అన్న‌ది కేంద్రం తెర‌పైకి తెచ్చింది. క‌మ్యూనిస్టులు కూడా వ్య‌తిరేకించి రోడ్డెక్కారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్-ను ఉద్దేశించి ఓ స‌ల‌హా కూడా ఇచ్చారు..అదేంటంటే.. వ్య‌వ‌సాయ మీట‌ర్లు అన్న‌వి పెట్టి, బిల్లులను న‌గ‌దు రూపంలో సాగు దారుడికి ఇచ్చే క‌న్నా నేరుగా ఆ మొత్తాల‌ను డిస్కంల‌కు చెల్లిస్తే ఇంకా బాగుంటుంది క‌దా అని! కానీ దీనిని జ‌గ‌న్ వినిపించుకోలేదు.

వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ఎలానూ ఎప్ప‌టి నుంచో ఒప్పుకోవ‌డం లేదు క‌నుక జ‌గ‌న్ ఈ విధంగా నిర్ణ‌యం తీసుకుని ఉంటార‌ని అంటున్నారు ఇంకొంద‌రు.(ఈ విష‌యంలో కాంగ్రెస్ పెద్ద‌లకు కూడా మిన‌హాయింపు ఏం లేదు. వాళ్లు కూడా ఆ రోజు ఉచిత విద్యుత్ ను వ్య‌తిరేకించిన వారే అన్న వార్త‌లు అప్ప‌ట్లో వెలుగు చూశాయి కూడా)

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కారు విధాన ప‌ర నిర్ణ‌యాల అమ‌ల్లో భాగంగా సేద్య‌గాడికి వ‌చ్చే బిల్లును న‌గ‌దు బ‌దిలీ చేసి, త‌ద్వారా ఆ మొత్తాన్ని విద్యుత్ శాఖ‌కు ల‌బ్ధిదారుడే చెల్లించే విధంగా చేయ‌డం. కానీ ఈ విధానం అస్స‌లు వ‌ర్కౌట్ కాద‌ని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే గ్రామీణ భార‌తావ‌నిలో విద్యుత్ మొండి బ‌కాయిలు చాలా ఎక్కువ‌గానే ఉంటున్నాయి.

వీటికి తోడు వ్య‌వ‌సాయానికి వాడుకునే విద్యుత్ బిల్లును ముందు స‌ర్కారు న‌గ‌దు బ‌దిలీ ద్వారా అందించి, త‌ద్వారా ఆ బిల్లు మొత్తాన్ని సంబంధిత కార్యాల‌యాల‌కు వెళ్లి క‌ట్టేయండి అని చెబితే రైతులు వినే ర‌కం కాదు. గ‌తంలో క‌న్నా భిన్న‌గా విద్యుత్ శాఖ కు మొండి బ‌కాయిలు పెరిగిపోవ‌డం ఖాయం. ఓ విధంగా ప్ర‌భుత్వ‌మే ఉద్దేశ పూర్వ‌క ఎగ‌వేత‌దారుల‌ను పెంచి పోషించిన తీరు ఒకటి మ‌ళ్లీ మ‌ళ్లీ షురూ కావ‌డం ఖాయం. అందుకే ఈ విధానాన్ని విప‌క్షాలు కూడా వ్య‌తిరేకిస్తున్నాయి.