Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   7 Aug 2020 9:15 AM IST
స్థానిక ఎన్నికలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
X
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఎప్పటికప్పడు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన స్థానిక ఎన్నికల్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని జగన్ సర్కారు అనుకోవటం.. అంతలోనే విరుచుకుపడిన కరోనా దెబ్బకు.. ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అనంతరం.. ఈ నిర్ణయంపై జగన్ సర్కరు స్పందించిన తీరు.. తదనంతర పరిణామాలు తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో నిమ్మగడ్డను మరోసారి ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఏపీ సర్కరు నిర్ణయం తీసుకోవటం.. ఆయన తన పదవీ బాధ్యతల్ని చేపట్టటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. కరోనా తీవ్రత అంతకంతకూ పెరగటం.. కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి వేళ.. స్థానిక ఎన్నికల్ని నిర్వహించే పరిస్థితి లేదు. మరోవైపు స్థానిక ఎన్నికల విషయంలో గతంలో జారీ చేసిన ఆర్డినెన్సు గడువు ముగిసింది. దీంతో.. ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పట్లో రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు అవకాశం లేని రీతిలో ఆర్డినెన్సును జారీ చేసింది.

ఏపీలో మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తున్నట్లుగా తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలోని 108 కార్పొరేషన్లు.. మున్సిపాలిటీ.. నగర పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో.. ప్రత్యేక అధికారుల పాలనలో డిసెంబరు 31 వరకు పొడిగించారు. అదే సమయంలో.. ఆ తేదీ లోగా పాలక వర్గం ఏర్పాటు కాని పక్షంలో.. ఏర్పాటు అయ్యే వరకు పొడిగిస్తున్నట్లుగా నోటిషికేషన్ లో పేర్కొన్నారు.

మరోవైపు ఏపీలోని అన్ని పురపాలక సంఘాల్లోనూ వచ్చే ఏడాది (2021) జనవరి రెండు వరకు ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తున్నట్లుగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. కరోనా కారణంగా తామీ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇదంతా చూస్తే.. వచ్చే ఏడాది జనవరి వరకు ఏపీలో స్థానిక ఎన్నికలకు అవకాశం లేనట్లే. ఇదిలా ఉంటే.. రాజ్యాంగ నిబంధనలు.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏపీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్సు చెల్లదన్న మాట వినిపిస్తోంది. మరి.. న్యాయశాఖ సలహా.. సూచనలు తీసుకోకుండానే ఏపీ సర్కారు ఆర్డినెన్సు నిర్ణయం తీసుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.